Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కామెడీ:పూటుగా తిని దీక్షలోకి
By: Tupaki Desk | 9 April 2018 5:43 PM GMTగతవారం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరిగిన ఓ చిత్రమైన ఉదంతం గుర్తుండే ఉంటుంది. కావేరీ వివాదంపై బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తమిళనాడులో అధికారపక్షమైన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. నిరాహార దీక్ష అని ప్రకటించి...మధ్యలో బీరు - బిర్యానీ తిని హాయిగా దీక్షను కొనసాగించారు. ఈ వీడియో వైరల్ అయింది. అధికార అన్నాడీఎంకే పరువు బజారు పాలయింది. సరిగ్గా ఇప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అలాగే నవ్వుల పాలయింది. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తుంటే...పూటుగా తిని ఆ పార్టీ నేతలు దీక్షకు కూర్చున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
రాజ్ ఘాట్ వేదికగా రాహుల్ ఈ దీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో రాహుల్ సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారని పార్టీ వెల్లడించింది. అయితే వాళ్లంతా నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఉదయమే ఫుల్లుగా తినేశారని ఢిల్లీ బీజేపీ లీడర్ హరీష్ ఖురానా ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్ లో కాంగ్రెస్ నేతలు చోలె భటూరె తింటున్న ఫొటోను ట్వీట్ చేశారు. అందులో మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ కూడా ఉన్నారు. దీంతో సహజంగానే బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇదీ కాంగ్రెస్ చిత్తశుద్ధి అని ఎద్దేవా చేసింది. ఇంతేకాకుండా ఈ ఫొటో పట్టుకొని కాంగ్రెస్‌ను బీజేపీ నేతలు చెడుగుడు ఆడుకున్నారు.
అయితే ఈ ఘటనతో పరువు పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. అయితే ఇదేమీ నిరవధిక నిరాహారదీక్ష కాదని, ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగన్నర వరకు చేస్తున్న దీక్ష అని కాంగ్రెస్ నేత ఏఎస్ లవ్లీ చెప్పారు. ఆ ఫొటో ఉదయం 8 గంటల కంటే ముందు తీసిందని - బీజేపీ దేశాన్ని సక్రమంగా నడపాల్సింది పోయి మేం ఏం తింటున్నామో చూసే పని పెట్టుకుందని ఆయన అన్నారు. బీజేపీ దళితుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.