Begin typing your search above and press return to search.

ఆ స‌ర్వేను లైట్ తీసుకోవాలంటున్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   10 Nov 2018 4:11 AM GMT
ఆ స‌ర్వేను లైట్ తీసుకోవాలంటున్న కాంగ్రెస్‌
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కిక ఎదురే లేద‌ని.. తానేం చేయాల‌నుకుంటే తెలంగాణ‌లో అదే జ‌రుగుతుంద‌న్న భావ‌న కేసీఆర్ లో ఎక్కువ మోతాదులో ఉండేది. అదే ఆయ‌న్ను ముంద‌స్తుకు వెళ్లేలా చేసింది. ఇప్పుడు అదే న‌మ్మ‌కం గులాబీ కారు స్పీడుకు బ్రేకులు వేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే వ‌ర‌కూ వాతావ‌ర‌ణం అంతా పాజిటివ్ గా ఉన్నట్లు క‌నిపించినా.. త‌ర్వాతి కాలంలో ప‌రిస్థితి అంత‌కంత‌కూ మారిపోతున్న ప‌రిస్థితి.

చివ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితి ఉందంటే.. కేసీఆర్ కు చాలా స‌న్నిహితంగా.. ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేసేలా.. ర‌క్ష‌ణ క‌వ‌చంలా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థలు సైతం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్న ప‌రిస్థితి. కొన్ని సంద‌ర్భాల్లో కేసీఆర్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే వార్త‌ల్ని సైతం ప్ర‌చురించేందుకు వెనుకాడ‌టం లేదు.

ఇదంతా ఎందుకంటే.. కేసీఆర్ ప్ర‌భ అంత‌కంత‌కూ కొడిగ‌డుతుంద‌న్న ఫీడ్ బ్యాక్ తో పాటు... సోష‌ల్ మీడియాలోనూ అలాంటి జోరే క‌నిపిస్తోంది. ఇక‌.. కేసీఆర్ సైతం గ‌మ్మున ఉండిపోవ‌టం ప‌లు సందేహాల‌కు తెర తీసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జాతీయ మీడియా సంస్థ‌గా.. పొలిటిక‌ల్ వార్త‌ల విష‌యంలోనూ.. మ‌రి ముఖ్యంగా ఎన్నిక‌ల విశ్లేష‌ణ విష‌యంలో న‌మ్మ‌ద‌గ్గట్లుగా ఉండే ఇండియాటుడే సంస్థ త‌న స‌ర్వే ఫ‌లితాల్ని అచ్చేసింది.

దీని ప్ర‌కారం తెలంగాణ‌లో 45 శాతం మంది టీఆర్ ఎస్ పార్టీని ఓటు వేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. అంతిమంగా కేసీఆర్ మ‌రోసారి అధికారాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ఇందులో నిజం ఎంత‌న్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాతే తెలిసేది. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింద‌న్న మాట చెప్ప‌క త‌ప్పదు. త‌మ చుట్టూ ఉన్న వారిని మిన‌హాయించి.. వారికి శ్రేయోభిలాషులుగా వ్య‌వ‌హ‌రించే ప‌లువురు మీడియా మిత్రులు తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ కు పెరుగుతున్న వ్య‌తిరేక‌త గురించి చెప్ప‌టం వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

ఇందుకు భిన్న‌మైన ఫ‌లితం అంతిమంగా వ‌స్తుంద‌న్న విశ్లేష‌ణ‌తో ఉన్న ఇండియా టుడే స‌ర్వే ఊర‌ట‌నిచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఈ స‌ర్వేపై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతోంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై ఆ పార్టీ నేత‌లు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అమెరికాలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ ఇదే జాతీయ మీడియా హిల్ల‌రీ క్లింట‌న్ గెలుస్తుంద‌న్న మాట‌ను చెప్పార‌ని.. చివ‌ర‌కు ఎవ‌రు గెలిచారో చూసుకోవాల‌న్నారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోనే కాదు.. తమిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ డీఎంకేకు వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంద‌న్న మాట చెప్పార‌ని.. చివ‌ర‌కు ఫ‌లితం ఎలా వ‌చ్చిందో తెలుసు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అలా త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న స‌ర్వే ఫ‌లితంపై త‌మ‌కు ఏ మాత్రం ఆందోళ‌న లేద‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల వాద‌న‌. త‌మ‌కు అనుకూలంగా వాద‌న వినిపించ‌టం అన్ని పార్టీలు చేసేవే. ఏ లాజిక్కును చూపించి వాతావ‌రణం త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని చెబుతున్న కాంగ్రెస్ నేత‌లు... అదే లాజిక్కును రివ‌ర్స్ చేసి చూస్తే.. కొంప‌లు మునుగుతాయ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిదేమో?