Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ నీర‌సం

By:  Tupaki Desk   |   31 May 2018 6:26 AM GMT
క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ నీర‌సం
X
ఏడంటే ఏడు సీట్లు త‌గ్గితే.. అధికారం ఇవ్వ‌రా? అంటూ అమాయ‌కంగా అడుగుతున్న బీజేపీ నేత‌ల్లోని అమాయ‌క‌త్వాన్ని క‌న్న‌డ ఓట‌ర్లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఆ విష‌యాన్ని తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో స్ప‌ష్టం చేశారు. పోటాపోటీగా సాగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యానికి చేరువ‌గా వ‌చ్చిన బీజేపీకి అధికారం అందిన‌ట్లే అంది చేజారిపోవ‌టం.. ప‌వ‌ర్ కోసం ఆ పార్టీ చేసిన ప్ర‌య‌త్నాలు చౌక‌బారుగా ఉండ‌ట‌మే కాదు.. మ‌రీ అంత ఆత్ర‌మేల‌? అన్న ప్ర‌శ్న‌ను వేసేలా చేశాయి.

అధికారం కోసం ఎంతకైనా తెగిస్తామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన బీజేపీ నేత‌ల‌కు షాకిస్తూ ఓట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లోని ఆర్ ఆర్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దూసుకెళుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం ఆర్ ఆర్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్య‌ర్థి తిరుగులేని అధిక్య‌త‌తో దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి మునిర‌త్న 16,581 ఓట్ల అధిక్యంలో ఉండ‌గా.. ఆయ‌న స‌మీప బీజేపీ అభ్య‌ర్థి తుల‌సి మునిరాజుకు 7,901 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. జేడీఎస్ అభ్య‌ర్థి మూడో స్థానంలో నిలిచారు.

మే 28న జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆర్ ఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 4,71 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ సాగుతున్న ట్రెండ్ ప్ర‌కారం చూస్తే.. కాంగ్రెస్ పార్టీ విజ‌యం ప‌క్కా అని తేలిన‌ట్లే. ఈ కార‌ణంతోనే కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికే రోడ్ల మీద‌కు వ‌చ్చి సంబ‌రాలు షురూ చేశారు. ప్ర‌స్తుతానికి అధికారాన్ని జేడీఎస్ కు అప్ప‌గించినా.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అధిక్య‌త త‌గ్గ‌లేద‌న్న విష‌యాన్ని తాజా ఉప ఎన్నిక స్ప‌ష్టం చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఫ‌లితం కాంగ్రెస్ పార్టీలో మ‌నోధైర్యాన్ని మ‌రింత పెంచ‌క మాన‌దు.