Begin typing your search above and press return to search.

అదిరేలా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:23 AM GMT
అదిరేలా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్.. కార్పొరేషన్ల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కామన్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రం మొత్తంగా తమ పార్టీ విజన్ ఏమిటన్న విషయాన్ని తమ ఎన్నికల ప్రణాళికలతో స్పష్టం చేశామంటున్నారు. కాంగ్రెస్ ఆలోచనలు ప్రజలకు తెలిసేలా మేనిఫెస్టో రూపొందించినట్లు చెబుతున్నారు.

నిత్యం అధిక్యత కోసం కొట్టుకు చావటం తప్పించి.. ప్రజల్ని.. ప్రజల అవసరాల్ని పట్టించుకోవటం మానేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పుర ఎన్నికల వేళ మాత్రం కామన్ మేనిఫెస్టో అంటూ చేస్తున్న హడావుడి కామెడీగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా అంటే.. ఎన్నికల్లో అధికార పక్షానికి తీవ్ర పోటీ ఇవ్వాలన్న ధ్యాస కంటే కూడా.. ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

పుర ఎన్నికల్లో ఆయా పార్టీలు ఏమేం హామీలు ఇస్తాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అసలు అదో విషయంగా ఫీల్ కారు. అలాంటివేళ.. ఏదేదో చేస్తామన్న హామీలతో ప్రయోజనం ఉండదు. దాని కంటే ఎక్కువగా వర్గాల్ని పక్కన పెట్టి.. సమిష్ఠిగా పోరాడితే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నేతలు.. మేనిఫెస్టోను భారీగా రూపొందించే విషయం మీద మాత్రం ఎక్కువ శ్రద్ధను పెట్టినట్లుగా కనిపిస్తోంది. హామీల పరంగా చూస్తే.. కాంగ్రెస్ కామన్ మేనిఫెస్టో బాగున్నప్పటికీ.. అసలు ఆ హామీల్ని ఎవరు పరిగణలోకి తీసుకొని ఓటు వేస్తారన్నది అసలు ప్రశ్న.

కాంగ్రెస్ కామన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి చూస్తే..

% 500 చదరపు అడుగులలోపు నిర్మాణ వైశాల్యం ఉన్న ప్రతి ఇంటికి ఆస్తి పన్ను రద్దు

% మున్సిపాలిటీల్లో భవనాల క్రమబద్ధీకరణ పథకం అమలు, అదనపు గదుల క్రమబద్ధీకరణకు అవకాశం

% తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఉచిత నల్లా - మంచినీటి సరఫరా

% ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్గత రోడ్లు - రోడ్డు డివైడర్లు - భూగర్భ డ్రైనేజీలు - ఎల్ ఈడీ వీధిదీపాల ఏర్పాటు - ఇంకుడు గుంతల నిర్మాణం

% ప్రతి మున్సిపాలిటీలో పార్కులు - గ్రీన్‌ బెల్టులు - చెరువుల సుందరీకరణ - బతుకమ్మ ఘాట్‌ ల నిర్మాణం

% స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో మధ్యాహ్నం - రాత్రి రూ.5కే భోజన పథకం అమలు

% కూరగాయల విక్రయ కేంద్రాలు - షాపింగ్‌ కాంప్లెక్సులు - స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు

% మూత్రశాలలు - మరుగుదొడ్ల నిర్మాణం - కుక్కలు - కోతులు - దోమల నియంత్రణకు ప్రత్యేక నిధులు

% ఇండోర్‌ స్టేడియంతో పాటు అన్ని వసతులతో కూడిన విశాల క్రీడా మైదానాలు - జిమ్‌ ల ఏర్పాటు

% ప్రతి మున్సిపాలిటీలో ఇంటర్నెట్‌ సౌకర్యంతో రీడింగ్‌ రూం లున్న లైబ్రరీలు

% మున్సిపాలిటీల్లోని ముఖ్య కూడళ్లలో ఉచిత వైఫై సౌకర్యం

% శాంతిభద్రతల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు