Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ హడావుడి లెక్క ఇదేనా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 12:30 PM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ హడావుడి లెక్క ఇదేనా?
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక వ్యవహారంలో మెలోడ్రామా మామూలుగా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లను ఆశించే వారిని వడపోయటం కష్టం కావటంతో.. అప్లికేషన్లు పెట్టాలని చెప్పటంలో అర్థం ఉంది. కానీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలిచే వారి కోసం భారీ ప్రాసెస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఆశిస్తున్న వారు.. పార్టీకి అప్లికేషన్ పెట్టుకోవటమే కాదు.. రూ.5వేల డీడీ తీసి.. బయోడేటా ఫారం నింపి.. పాస్ పోర్టు సైజు ఫోటో జత చేసి పంపాలన్న రూల్ పెట్టారు.

ఒక ఉప ఎన్నిక కోసం.. పెద్దగా బలం చూపుతుందన్న భావన ఎవరికి లేని పార్టీ టికెట్ కోసం ఇంత ప్రాసెస్ దేనికి? ఇదంతా దేని కోసం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అప్లికేషన్లు సేల్ కు పెట్టినంతనే బుధవారం రెండు అప్లికేషన్లు అందుకున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందులో ఒకరు హుజూరాబాద్ మండలంలోని కనుకుంట్ల గ్రామానికి చెందిన కమలాకర్రెడ్డి కాగా.. రెండో ఆశావాహుడు సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డిగా చెబుతున్నారు.

పార్టీకి అందే అప్లికేషన్లను పరిశీలించి..వడబోసి సెప్టెంబరు 10న అభ్యర్థి ఎంపిక చేస్తామని.. అధికారికంగా పేరు ప్రకటిస్తామని చెబుతున్నారు. నిజంగానే అంత ప్రాసెస్ అవసరమా? అంటే.. ఇదంతా హడావుడి కార్యక్రమని చెబుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎంతలా ఉందన్న విషయాన్ని తెలియజేయటంతో పాటు.. హైప్ క్రియేట్ చేయటం కోసం పడుతున్న పాట్లుగా చెబుతున్నారు. ఏమాటకు ఆ మాటే చెప్పాలంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ మొత్తం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని చెప్పాలి.

సుదీర్ఘకాలం కేసీఆర్ వెన్నంటి ఉండి.. ఈ మధ్యనే పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న ముఖాముఖి పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే.. మూడో క్రిష్ణుడిగానే చూడాలే తప్పించి.. మిగిలిన ఇద్దరితో పోటీ పడే అవకాశం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల జాబితా పెద్దదిగా ఉందని చెప్పుకోవటమే ఈ ప్రయాస అంతా.. అన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారు కదా? అప్లికేషన్ పెట్టుకున్న వారిలోని ఆశావాహుడికే టికెట్ ఫైనల్ చేస్తామన్న హామీ ఇవ్వగలరా? అన్న ప్రశ్నకు టీపీసీసీ సమాధానం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.