Begin typing your search above and press return to search.

120 కోట్ల డీల్ ఓకే త‌ర్వాతే పార్టీ జంప్‌

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:44 AM GMT
120 కోట్ల డీల్ ఓకే త‌ర్వాతే పార్టీ జంప్‌
X
తెలుగు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు బీజం వేసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల‌కు గులాబీ కండువా క‌ప్పిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఆస‌క్తిక‌ర‌మైన విమ‌ర్శ చేసింది. త‌న పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంలో భాగంగా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు హెచ్చ‌రిక‌ల‌కు జారీ చేసిన టీఆర్ ఎస్ పార్టీ అనంత‌రం వారికి మేలు చేసింద‌ని ఆరోపించారు. అర్హ‌త ఉన్న‌ వారికి కాంట్రాక్టులు - అవ‌స‌రమైన వారికి సొంత‌ ప్ర‌యోజ‌నాలు చేయ‌డం ద్వారానే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లో చేరార‌ని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పువ్వాడ అజ‌య్ పార్టీ మార‌డం వెనుక 40 కోట్ల రూపాయ‌ల డీల్ ఉంద‌ని సంప‌త్ ఆరోపించారు. మ‌రో ఎంపీ విష‌యంలో 120 కోట్ల రూపాయ‌ల కాంట్రాక్ట్ కేటాయింపు ఉంద‌ని తెలిపారు.

సీఎల్పీ కార్యాలయంలో సంప‌త్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా టీఆర్‌ ఎస్‌ నేతలు బ్లాక్‌మొయిల్‌ రాజకీయాలు ఆపడం లేదన్నారు. ప్రభుత్వం భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకుని ఉంటే ఆ భూమిని క్రమబద్దీకరించాలని తెచ్చిన జీవో 59 ద్వారా పువ్వాడ అజయ్‌ కుమార్‌ కు 11వేల గజాల భూమి అప్పనంగా కట్టబెట్టిందన్నారు. ప్రభుత్వం దారాద‌త్తం చేసిన 11వేల గజాల భూమి విలువ రూ 40 కోట్లు అని సంప‌త్ కుమార్ తెలిపారు. క్విడ్‌ ప్రోకో ద్వారా ఈ ఒప్పందం కుదిరి లబ్ది చేకూర్చినట్టు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఈ వ్యవహరంపై హైకోర్టును ఇప్ప‌టికే ఆశ్రయించి విచార‌ణ కోరుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో పాటు వైసీపీ త‌ర‌ఫున గెలిచి అధికార టీఆర్ ఎస్‌ పార్టీలో చేరిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 120 కోట్ల రూపాయ‌ల‌ కాంట్రాక్టును తెలంగాణ ప్ర‌భుత్వం కట్టబెట్టిందని సంప‌త్‌ ఆరోపించారు. ఈ ఇద్దరి విషయంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/