Begin typing your search above and press return to search.

దుబ్బాకలో కాంగ్రెస్ కొత్త స్కెచ్.. గుర్రం ఎగరావచ్చట

By:  Tupaki Desk   |   3 Nov 2020 5:00 AM GMT
దుబ్బాకలో కాంగ్రెస్ కొత్త స్కెచ్.. గుర్రం ఎగరావచ్చట
X
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చూసినోళ్లంతా ఒక విషయాన్ని అదే పనిగా చర్చించుకోవటం కనిపించింది. ఎన్నిక ఏదైనా కానీ.. తనదైన ఎత్తులు వేసే కాంగ్రెస్.. టీఆర్ఎస్.. బీజేపీ ధాటికి చేష్టలుడిగినట్లుగా ఉండినట్లు ప్రచారం సాగింది. గులాబీ బ్యాచ్ వర్సెస్ కమలనాథులు అన్నట్లుగా మారిన తీరుతో కాంగ్రెస్ సోదిలో లేనట్లుగా ప్రచారం సాగింది. ఉప ఎన్నిక మొదట్లో పోటీ మొత్తం టీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే సాగుతుందని భావించగా.. తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలిసిందే.

అందరూ తమను పట్టించుకోకుండా ఉండటమే తమకు జరిగే మేలు అన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ది మూడో స్థానమే అన్న ప్రచారం అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఎన్నికల ఫలితం అందుకు భిన్నంగా ఉంటుందన్న ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదెలా అంటే.. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కాంగ్రెస్ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి కొత్త ఎత్తు వేసినట్లు చెబుతున్నారు.

వర్గాల వారీగా సమీకరించి.. ఓట్ల లెక్కలు తేల్చారని.. అందుకు తగ్గట్లే పంపిణీ చేసినట్లుగా సమాచారం. ఇందుకోసం కాంగ్రెస్ కు చెందిన పలువురు ఆగ్రనేతల కనుసన్నల్లో ఇదంతా జరిగినట్లు చెబుతున్నారు. మిగిలిన రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. విమర్శలు చేసుకుంటూ.. ఫోకస్ మొత్తం వారి మీదే ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు.

ఈ వ్యవహారంపై మిగిలిన రెండు పార్టీలకు అర్థమయ్యే సమయానికి కాంగ్రెస్ తాను చేయాల్సింది చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం పోలింగ్ తీరును మార్చేస్తుందని.. వారు అనుకున్నట్లు జరిగితే.. కాంగ్రెస్ గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒకవేళ విజయం లభించకున్నా.. రెండో స్థానం మాత్రం ఖాయమన్న మాట వారి నోటి నుంచి రావటం గమనార్హం.