Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ.. ఓఎల్ఎక్స్ బ్యాచ్ తో ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   14 Jan 2020 3:30 AM GMT
కాంగ్రెస్ పార్టీ.. ఓఎల్ఎక్స్ బ్యాచ్ తో ఇంకెన్నాళ్లు?
X
ఒక‌వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీపై జాతీయ స్థాయిలో క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతూ ఉంది. ప్ర‌త్యేకించి బీజేపీకి బాగా ఆద‌ర‌ణ క‌నిపించిన ఉత్త‌రాదినే ఆ పార్టీ వ్య‌తిరేక‌త‌ను పెంచుకుంటూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కే అధికారాన్ని అప్ప‌గిస్తూ ఉన్నారు. ఇక యువ‌త‌లో అయితే బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతూ పోతోంది. మోడీ, అమిత్ షాలు మాట‌ల రాయుళ్లే త‌ప్ప‌.. దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌రా? అనే అనుమానాలు ప‌తాక స్థాయికి వెళ్తూ ఉన్నాయి. ఎంత‌సేపూ హిందుత్వ‌, జాతీయ‌వాదం త‌ప్ప మోడీ నుంచి ఫ‌లితాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల‌ను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాల్సి ఉంది.

అయితే ఆ పార్టీలో మాత్రం అంత జోష్ క‌నిపించ‌డం లేదు. కొన్ని రాష్ట్రాల్లో సానుకూల ఫ‌లితాల‌ను చ‌విచూస్తున్నా కాంగ్రెస్ లో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ కు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో సానుకూల స్థితి ఉంది. అక్క‌డ పుంజుకోవ‌డానికి కాంగ్రెస్ కు బేస్ మెంట్ ఉంది. ఆ బేస్ మెంట్ మీద బిల్డింగ్ నిర్మించాలంటే దానికి యువ‌శ‌క్తి అవ‌స‌రం. కాంగ్రెస్ పార్టీ కొత్త‌గా నేత‌ల‌ను త‌యారు చేసుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ఎక్క‌డైనా ప‌డాల్సిన ఓట్లు అయినా ప‌డ‌తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ లో మాత్రం ఆ మార్పు క‌నిపించ‌డం లేదు.

కాంగ్రెస్ లో యువ‌నాయ‌క‌త్వం అంటే.. ఎప్పుడో న‌ల‌భై దాటేసిన రాహుల్ రావ‌డం మాత్ర‌మే అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. స్టూడెంట్ వింగ్ నుంచి కాంగ్రెస్ కు ఒక నిర్మాణం ఉంది. అయితే అక్క‌డ నుంచి లీడ‌ర్ల‌ను మాత్రం ఎద‌గ‌నీయ‌డం లేదు. ఎంత‌సేపూ.. అదే గులాంన‌బీ ఆజాద్, అదే దిగ్విజ‌య్ సింగ్ అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఇక ఇప్ప‌టికీ టీ కాంగ్రెస్ లో కాంగ్రెస్ వీహెచ్ వంటి ప్ర‌జామ‌ద్ద‌తు కూడా లేని వృద్ధ నేత‌లే మాట్లాడుతూ ఉంటారు. వీరిని చూసి చూసి జ‌నాల‌కు కూడా విసుగు వ‌చ్చిన‌ట్టుగా ఉంది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రిపేర్ల‌కు పూనుకోలేదు. 2019 ఎన్నిక‌ల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన గుణ‌పాఠాలు ఎన్నో ఉన్నాయి. అది జ‌రిగితేనే..2024లో అయినా కాంగ్రెస్ పుంజుకునే అవ‌కాశాలున్నాయి. అందుకోసం ముందుగా చేయాల్సింది.. నేత‌ల‌ను త‌యారు చేసుకోవ‌డం. త‌మ అనుకూల‌త‌ల‌ను గుర్తించి.. త‌మ టార్గెటెడ్ సీట్ల‌ను త‌యారు చేసుకుని ప‌ని చేసుకోవ‌డం మొద‌లుపెడితే కాంగ్రెస్ కు ఇప్ప‌టికీ అవ‌కాశాలు ఏమీ చేయిదాటిపోలేదు. కావాల్సింద‌ల్లా ఆ పార్టీ అధిష్టానం మేల్కోవ‌డం, అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డం.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను తిరిగి రాహుల్ గాంధీ చేప‌ట్ట‌బోతున్న‌ట్టుగా ఉన్నారు. మ‌రి ఇప్పుడైనా మార్పుచేర్పులు జ‌రుగుతాయేమో!