Begin typing your search above and press return to search.

పొత్తు మాట ఎందుకు.. జత కట్టాలిగా..?

By:  Tupaki Desk   |   15 Dec 2015 5:24 AM GMT
పొత్తు మాట ఎందుకు.. జత కట్టాలిగా..?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు.. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని డప్పాలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురువుతుందన్న విషయాన్ని విభజన సమయంలోనే పలువురు అంచనా వేశారు. అయితే.. ఈ మాటల్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం అంగీకరించే వారు కాదు. కాంగ్రెస్ మీద కోపంతో.. పార్టీ బలాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ విసుక్కునే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తాము ఎంత తక్కువగా అంచనా వేశామన్న విషయం వారికి బాగానే అర్థమైంది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకోవటమే తప్పించి.. అనుకోని సంక్షోభం వస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేయకపోవటమే తాజా దుస్థితికి కారణంగా చెప్పాలి. గతాన్ని వదిలేస్తే.. వర్తమానంలో కూడా ఆ పార్టీ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటుందే తప్పించి.. వాస్తవిక ధోరణితో వ్యవహరించటం లేదన్న మాట చెప్పక తప్పదు. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెబుతున్న ఆ పార్టీ వాస్తవ పరిస్థితి చూస్తే.. అసలు వారితో జత కట్టటానికి సిద్ధంగా ఉండే రాజకీయ పక్షాలే కనిపించవు.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీని విస్తరించే విషయంలో జరిగిన నిర్లక్ష్యమే తాజా దుస్థితికి కారణంగా చెప్పాలి. వైఎస్ ప్రభ వెలిగిపోతున్న క్రమంలో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మజ్లిస్ తో దోస్తీ దిశగానే పావులు కదిపారే తప్పించి.. బలం లేని సమయంలో మజ్లిస్ మిత్రత్వం ఏ మాత్రం అక్కరకు రాదన్న విషయాన్ని ఆలోచించలేదు. ఇలాంటి తప్పులే ఇప్పుడా పార్టీకి శాపాలుగా మారాయి.

గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న విషయంలో తెలంగాణ అధికారపక్షం చాలా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యలో విజయం కాకున్నా.. అవమానకర రీతిలో ఓటమి ఎదురుకాకపోతే అదే పదివేలుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యూహం మీద చర్చలు జరిగిన కాంగ్రెస్ అధినాయకత్వం.. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని గంభీరంగా ప్రకటించారు. నిజానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా.. వారితో జత కట్టే రాజకీయ పక్షం ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తిస్తే చాలు.