Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ ‘అసలు’ బలం తేలనుంది

By:  Tupaki Desk   |   1 Dec 2015 4:10 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్ ‘అసలు’ బలం తేలనుంది
X
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకూ వరంగల్ ఉప ఎన్నిక హడావుడి గురించి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం అద్భుత మెజార్టీతో విజయం సాధించి..విపక్షాలకు ఊహించని రీతిలో షాకిచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా.. ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాని దుస్థితి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. స్థానిక సంస్థలకు జరిగే మండలి ఎన్నికల గంట మోగింది. ఈ ఎన్నికల హడావుడి మొత్తం ముగిసేసరికి డిసెంబరు పూర్తి కానుంది.

ఆ వెంటనే.. గ్రేటర్ తో సహా మిగిలిన కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇలా వరుసగా రానున్న ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం.. తమకు లాభిస్తుందని.. తమకు తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారతామని భావించినప్పటికీ.. అదేమాత్రం సాధ్యం కాదన్న విషయం తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నయి. నాయకత్వ లేమి ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. ఎమ్మెల్సీ.. గ్రేటర్ ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని.. వరంగల్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిపైనా చర్చించింది. కాంగ్రెస్ అధినాయకత్వం తరఫున ఢిల్లీలో దిగ్విజయ్ తో తెలంగాణకు చెందిన ఉత్తమ్ కుమార్.. జనారెడ్డి.. షబ్బీర్ అలీ.. భట్టి విక్రమార్క లాంటి నేతలు భేటీ అయ్యారు.

తాజాగా జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోరాడుతుందని.. ఏ పార్టీతోనూ తాము కలిసి పని చేయమని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా టీడీపీ.. కాంగ్రెస్ లు కలవనున్నాయని.. ఈ కాంబినేషన్ లో ఎన్నికల బరిలోకి దిగి.. అధికారపార్టీ దూకుడుకు కళ్లాలు వేస్తారన్న వాదన వినిపించింది. నిజానికి ప్రాక్టికల్ గా సాధ్యం కాని ఈ అంశం మీద జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో.. ఇలాంటివి పార్టీ మీద ప్రభావం చూపిస్తాయన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం గుర్తించినట్లు కనిపిస్తోంది.

అందుకేనేమో.. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటం లేదని డిగ్గీరాజా తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు.. త్వరలో జరిగే గ్రేటర్.. వరంగల్.. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. డిగ్గీ మాటలు చూస్తే.. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే కాంగ్రెస్ ‘‘అసలు’’ బలం ఏమిటో బయటకు రానుందన్న మాట.