Begin typing your search above and press return to search.

మోడీని రౌండ‌ప్ చేసేందుకు ప్లాన్ రెడీ

By:  Tupaki Desk   |   25 Dec 2016 4:46 AM GMT
మోడీని రౌండ‌ప్ చేసేందుకు ప్లాన్ రెడీ
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని న‌రేంద్ర మోడీ డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలను వెంటాడున్న అంశం ఇదే. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 50 రోజుల సమయాన్ని అడిగిన ప్రధాని.. ఏ సంచలన ప్రకటన చేయబోతున్నారనే దానిపై విపక్ష నేతలు ఆసక్తిగా ఉన్నారు. మోడీ ఏ నిర్ణ‌యం తీసుకుంటే తాము ఏం చేయాలి? అలాంటి నిర‌స‌న ఉమ్మ‌డిగా చేయ‌డం మేలా లేదంటే...ఎవ‌రికి వారేనా అనే రీతిలో సందేహాలు మొద‌ల‌య్యాయి. అయితే ఈ గంద‌రగోళం స‌మ‌యంలోనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందుకోసం నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఒక్క వేదిక మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్ చొరవ తీసుకుంటోంది.

ఈ నెల 27న భవిష్యత్ వ్యూహాన్ని రచించేందుకు ఢిల్లీలోని కాన్‌ స్టిట్యూషన్ క్లబ్‌ లో 16 విపక్ష పార్టీలతో సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ముందు రోజే వివిధ రాష్ట్రాలకు చెందిన తమ నాయకులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటుచేసింది. తమ పార్టీనేతలతో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తదితరులందరినీ 27 నాటి సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి, డిసెంబర్ 30 తర్వాత చేపట్టబోయే కార్యాచరణ గురించి తీర్మానం చేస్తారని, అనంతరం అన్నిపార్టీల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్ 30 తర్వాత ప్రధాని మోడీ చేసే సంచలన ప్రకటన తదనంతరం వివిధ పార్టీలకు చెందిన దాదాపు వందమంది నాయకులతో ఒక నిరసన ప్రదర్శనను నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయం జరిగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/