Begin typing your search above and press return to search.

ప్రియాంక గాంధీని లోక్‌ సభకు పంపించడానికి కాంగ్రెస్ ప్లాన్ ఇదీ..

By:  Tupaki Desk   |   26 April 2019 2:16 PM GMT
ప్రియాంక గాంధీని లోక్‌ సభకు పంపించడానికి కాంగ్రెస్ ప్లాన్ ఇదీ..
X
వారణాసిలో మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ కానీ - ప్రియాంక కానీ అందుకు సాహసించలేదు. అయితే.. ప్రియాంకను పార్లమెంటుకు పంపించాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం గట్టిగా అనుకుంటోందట. అందుకోసం ఆ పార్టీ పెద్ద ప్లానే గీసినట్లు తెలుస్తోంది. ప్రియాంకకున్న ఇమేజ్ దెబ్బతినకుండా - ఆమె ఓడిపోయే ప్రమాదం ఏమాత్రం లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఆ క్రమంలోనే ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ తరువాత పార్లమెంటుకు పంపించాలని అనుకుంటున్నారట.

ఎన్నికల తరువాత పార్లమెంటుకు పంపించడం అంటే ఇంకేమీ కాదు. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమేఠీ - వాయనాడు రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారు. ఈ రెండు స్థానాల నుంచి కూడా ఆయన విజయం సాధిస్తే అందులో ఒక్క స్థానాన్ని ఉంచుకుని ఇంకొకటి వదులుకోవడం ఖాయం. ఆయన అమేఠీని ఉంచి వాయనాడును వదులుకుంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదంతా అనుకున్నట్లు జరిగి రాహుల్ వాయనాడు స్థానం ఖాళీ చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది . ఆ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేసి లోక్ సభకు వెళ్లాలన్నది రాహుల్ - సోనియాల ప్రణాళికల అట.

అయితే.. ఇదంతా రాహుల్ రెండు చోట్లా గెలిచినప్పుడు మాత్రమే జరుగుతుంది. రాహుల్ ఒకవేళ అమేఠీలోనో... వాయనాడులోనో ఓడిపోతే ప్రియాంక లోక్ సభకు వెళ్లడం ఇప్పుడిప్పుడే జరక్కపోవచ్చు.

మరోవైపు వారణాసిలో కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక ఎందుకు పోటీ చేయలేదో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శాం పిట్రోడా వివరించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రధాని మోదీ అంటే భయం వల్లనో లేదా భాజపాకు భయపడో కాదన్నారు. ఒక్క స్థానం మీదే దృష్టి పెడితే తన బాధ్యతలు సరిగా నిర్వహించలేనేమోనన్న కారణంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారని ఆయన తెలిపారు.