Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు చివ‌రికి మిగిలింది నాలుగే!

By:  Tupaki Desk   |   24 July 2019 5:05 AM GMT
కాంగ్రెస్ కు చివ‌రికి మిగిలింది నాలుగే!
X
ఒక‌ప్పుడు దేశంలో ఏ మూల చూసినా కాంగ్రెస్ ప‌వ‌ర్ క‌నిపించేది. ద‌క్షిణాది.. ఉత్త‌రాది.. ఈశాన్యం.. ఇలా అక్క‌డా ఇక్క‌డా.. ఎక్క‌డైనా కాంగ్రెస్సే అన్న‌ట్లు ఉండేది. 2014లో నిర్వ‌హించిన‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి సీన్ మొత్తం మారిపోయింది. వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కాస్త ముందు నుంచి.. భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పేలా ప‌లురాష్ట్రాల్లో కాంగ్రెస్ ప‌వ‌ర్ పోగొట్టుకుంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి వ‌రుస పెట్టి ప‌లు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ కోల్పోయిన కాంగ్రెస్‌.. తాజాగా క‌ర్ణాట‌క‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క ఎపిసోడ్ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి దేశంలో కేవ‌లం నాలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే అధికారం ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ నాలుగు రాష్ట్రాల్లో స‌రైన రాష్ట్రం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేద‌ని చెప్పాలి. ద‌క్షిణాదిన ఒక‌ప్పుడు తిరుగులేని శ‌క్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ రోజు అడ్ర‌స్ లేని ప‌రిస్థితి. అంతో ఇంతో ఉప‌శ‌మ‌నం ఏమైనా అంటే.. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంది. ఇది మిన‌హా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ ప‌వ‌ర్లో లేని ప‌రిస్థితి. ద‌క్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో అంతో ఇంతో బ‌లం ఉన్న‌ది క‌ర్ణాట‌క‌లోనే. ఇప్పుడా రాష్ట్రంలోనూ అధికారం చేజారిన నేప‌థ్యంలో.. ఆ పార్టీ ముక్క‌లైపోతుంద‌ని.. ప‌లువురు నేత‌లు పార్టీని వీడిపోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

ఇక‌.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. పంజాబ్‌.. రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అధికారం ఎప్పుడైనా చేజారే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్‌.. ఛ‌త్తీస్ గ‌డ్ లుచిన్న రాష్ట్రాలుకాగా.. రాజ‌స్థాన్ ఆర్థికంగా బ‌ల‌హీన‌మైన‌ది. మొత్తంగా చూస్తే.. బ‌ల‌మైన‌ రాష్ట్రాల్లో ప‌వ‌ర్ లేని కాంగ్రెస్‌..అధికారం చేతిలో ఉన్న రాష్ట్రాలు అంతంత‌మాత్రంగా ఉండ‌టం చూస్తే.. ఒక‌ప్పుడు ఎంత‌లా వెలిగిపోయిన పార్టీ.. ఇప్పుడెంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటుద‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.