Begin typing your search above and press return to search.

మాజీమంత్రితో దానంకి చెక్

By:  Tupaki Desk   |   11 Dec 2015 10:13 AM GMT
మాజీమంత్రితో దానంకి చెక్
X
జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయి. అస‌లే దిగ్గ‌జ నాయ‌కులంతా వ‌రుసపెట్టి తెరాస‌లో చేర‌డం కాంగ్రెస్‌ ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వెనుక వ‌రుస‌లోనే ఉండి..... అగ్ర‌నేత‌ల చాటున ప‌డిపోయిన నేత‌లు ఇప్పుడిప్పుడే బ‌య‌టికివ‌స్తున్నారు. ఇప్పుడు దానం నాగేంద‌ర్ కూడా పార్టీ మార‌వ‌చ్చ‌నే వార్త‌లొస్తున్న త‌రుణంలో మాజీమంత్రి ముఖేష్‌ గౌడ్ పేరు గ్రేట‌ర్ తెర‌పైకి వ‌స్తోంది. దీంతో నాయ‌కుల లోటును పూడ్చుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇదే స‌మ‌యంలో న‌గ‌రంలో ముఖేష్‌ గౌడ్‌ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌ గా పాల్గొన‌డంతోపాటు.. అటు నాగేంద‌ర్‌ కి కూడా చెక్ చెప్పిన‌ట్టు అవుతుంద‌ని అధిష్టానం భావిస్తోంది.

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ముఖేష్‌ కు నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ఏఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 2004 - 2009 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ముఖేష్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయిన త‌ర్వాత కాంగ్రెస్ రాజ‌కీయాల్లో క‌నిపించ‌డ‌మే మానేశారు. న‌గ‌రంలో నాగేంద‌ర్ హ‌వా కొన‌సాగుతుండ‌డంతో ఆయ‌న పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. అస‌లు తన సొంత నియోజ‌క‌వర్గంలో జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌ట్టించుకోవడం లేదు.

రెండు రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలు ముఖేష్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ ముఖేష్ గౌడ్ కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్ కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. అయితే నాగేంద‌ర్ ఎప్పుడు పార్టీకి షాక్ ఇస్తారో కూడా తెలియ‌కుండా ఉంద‌ని...అందుకే టీ కాంగ్రెస్ సీనియ‌ర్లు చాలా తెలివిగానే ఆయ‌న్ను న‌గ‌ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఎంత‌వ‌ర‌కూ ఈ వ్యూహాలు కాంగ్రెస్‌ కు బ‌లాన్నిస్తాయో వేచిచూడాల్సిందే.