Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో కుటుంబంలో ఒక‌రికే టికెటా..?

By:  Tupaki Desk   |   16 Jan 2022 3:49 AM GMT
టీ కాంగ్రెస్ లో కుటుంబంలో ఒక‌రికే టికెటా..?
X
తెలంగాణ కాంగ్రెస్ లో మ‌రో వివాదం చోటు చేసుకోనుందా..? ఇప్ప‌టికే స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో కునారిళ్లుతున్న ఆ పార్టీకి కొత్త చిక్కు వ‌చ్చి ప‌డ‌నుందా..? అధిష్ఠానం దృష్టికి ఒక వినూత్న ప్ర‌తిపాద‌న‌ను రేవంత్ తీసుకెళ్ల‌బోతున్నారా..? రేవంత్ పొడ గిట్ట‌ని చాలా మంది సీనియ‌ర్లు దీనికి ఒప్ప‌కుంటారా..? అని కాంగ్రెస్ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి. ఇంత‌కీ రేవంత్ కొత్త ప్ర‌తిపాద‌న ఏంటంటే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కుటుంబంలో ఒక‌రికే టికెట్ ఇవ్వాల‌ట‌. దీని వ‌ల్ల పార్టీ శ్రేణుల‌కు మంచి మెసేజ్ వెళ్లిన‌ట్లు ఉంటుంద‌ని.. ప్ర‌జ‌ల్లో కూడా కొత్త చ‌ర్చ లేవ‌నెత్తిన‌ట్లు ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. రేవంత్ మ‌దిలో మెదిలిన ఈ ఆలోచ‌న బాగానే ఉన్నా.. పార్టీ సీనియ‌ర్లు దీనికి స‌హ‌క‌రిస్తారా.. అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయ‌ట‌.

ఈ ప్ర‌తిపాద‌న ప‌రోక్షంగా త‌న‌కు కంట‌గింపుగా మారిన వారిని నిలువ‌రించ‌డానికే అన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు జ‌గ్గారెడ్డిని.. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దంప‌తులు, జానారెడ్డి కుటుంబం.. ఇంకా కొంత మంది సీనియ‌ర్ల‌ను అడ్డుకునేందుకు ఈ ప్ర‌తిపాద‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇది ఎలా అంటే ఒకే కుటుంబంలో ఇద్ద‌రు పోటీ చేసే అవ‌కాశం ఈ కుటుంబాల్లోనే ఉంద‌ట‌.

హుజూర్ న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్‌.. కోదాడ నుంచి ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఎలాగూ పోటీ జాబితాలో ఉంటారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన రాజ‌గోపాల రెడ్డి మునుగోడు నుంచి.. ఆయ‌న అన్న న‌ల్ల‌గొండ నుంచి బ‌రిలో ఉండే అవ‌కాశం ఉంది. దిగ్గ‌జం నేత జానారెడ్డి ఈసారి పోటీ చేయ‌క‌పోయినా ఆయ‌న కుమారులిద్ద‌రూ చెరో నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకుంటున్నారు. జ‌గ్గారెడ్డి కూడా త‌న‌తో పాటు త‌న స‌తీమ‌ణి లేదా త‌న కుమార్తెకు కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి కూడా త‌న‌కు.. త‌న కుమారుడికి టికెట్ ఆశిస్తున్నారు. ఇంకా కొంత మంది సీనియ‌ర్లు ఈ జాబితాలో ఉన్నార‌ట‌.

వీళ్లంద‌రినీ కాద‌ని అధిష్ఠానం రేవంత్ ప్ర‌తిపాద‌న‌కు ఒప్ప‌కుంటుందా..? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. అప్పుడు పార్టీలో తీవ్ర అంతర్యుద్ధం జ‌రిగే అవ‌కాశాల‌ను కొట్టి పారేయలేం. అయితే రేవంత్ ఆలోచ‌న‌ను పార్టీలో కొంద‌రు స్వాగ‌తిస్తున్నార‌ట‌. కొత్త వారికీ.. పార్టీని న‌మ్ముకున్న వారికి టికెట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. ఇది పార్టీకి మంచి సంప్ర‌దాయంగా మిలుగుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. వీళ్ల ఆలోచ‌న బాగానే ఉన్నా అధిష్ఠానం దీన్ని ఎలా చూస్తుంది..? దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో ఒక‌లా.. తెలంగాణ‌లో మ‌రోలా పార్టీ విధానాలు మార్చుకుంటుందా.. లేదా అనేది వేచి చూడాలి.