Begin typing your search above and press return to search.

బాంబ్ పేల్చిన కాంగ్రెస్... మద్యానికి దూరంగా ఉంటేనే పార్టీ సభ్యత్వం

By:  Tupaki Desk   |   25 Oct 2021 3:48 AM GMT
బాంబ్ పేల్చిన కాంగ్రెస్... మద్యానికి దూరంగా ఉంటేనే పార్టీ సభ్యత్వం
X
‘‘మద్యం తాగకూడదు. మాదక ద్రవ్యాలు తీసుకోవద్దు. పార్టీని బహిరంగంగా విమర్శించకూడదు’’ వీటికి దూరంగా ఉన్నవాళ్లకు మాత్రమే మా పార్టీలో సభ్యత్వాన్ని ఇస్తామని ప్రకటించారు. మీకు వెంటనే కమ్యూనిస్టు పార్టీ గుర్తుకువచ్చి ఉంటుంది. సరే కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ నియమాలు పాటిస్తున్నారా? అంటే సందేహామే. మీ సందేహాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఈ ప్రకటన చేసింది ఏ పార్టీనో తెలుసా? ఈ నియమాలను తప్పకుండా పాటించే వారికే తమ పార్టీలో సభ్యులుగా చేర్చుకుంటామని కాంగ్రెస్ పార్టీ నియమం పెట్టింది. మీరు నమ్మకపోయినా అక్షరాల ఈ ప్రకటన నిజం.

కాంగ్రెస్ పార్టీ మెగా సభ్యత్వానికి సిద్ధమవుతోంది. అయితే పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని నియమాలు విధించింది. పార్టీలో సభ్యులుగా చేరాలంటే మద్యం సేవించకూడదు. మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు... పార్టీని బహిరంగంగా విమర్శించకూడదు... ఇలా కండీషన్‌లు పెట్టింది. ఈ నియమాలకు సిద్ధపడితే మాత్రమే సరిపోదు. వీటికి దూరంగా ఉంటానని హామీపత్రం మీద సంతకం చేస్తే అప్పుడు పార్టీ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నియమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తేనే పార్టీ సభ్యత్వాన్ని ఇస్తారు. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ సభలు, సమావేశాలకు తప్పకుండా రావాలని షరతు పెట్టింది. పార్టీ కోసం శ్రమించడానికి సిద్ధంగా ఉన్నానని, ఓ కార్మికుడిగా పనిచేస్తానని ప్రమాణం కూడా చేయాలని నిబంధన విధించింది. ఇలా మొత్తం పది అంశాలతో హామీ పత్రాన్ని రూపొందించారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న చేదు నిజం.

నవంబర్ 1 నుంచి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని హస్తం గుర్తు పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31కి సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నికపై కసరత్తు ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది ఆగస్టు 20- సెప్టెంబరు 20 మధ్య పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26న సభ్యత్వ నమోదుపై కీలక సమావేశం నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నియమాలను చూసిన వారు ఆ పార్టీపై పలు సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అనేక మంది నేరచరితులున్నారని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్న సభ్యులు ఇంటికి సాగనంపుతారా అంటూ ఎగసెక్కాలాడుతున్నారు. మద్యం తాగడమనేది అసలు పెద్ద విషయమే కాదన్న భావన నేటి సమాజంలో వేళ్లూనుకుపోయిన తరుణంలో ఒకప్పటి భావాజాలాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ను చూసి ఇంతటి చరిత్ర ఉన్న పార్టీ ఇలా అయిపోయిందేమిటో అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు బ్రాంది షాపులు పెట్టి మద్యాన్ని తాగిస్తున్నారు వారి సంగతి ఏమిటీ.. మాదకద్రవ్యాల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఏం చేస్తారు? అవినీతికి కాంగ్రెస్‌ పార్టీనే మూలమని గొంతుచించుకుంటున్న బీజేపీ నేతలకు ఏ విధంగా సమాధానం చెబుతున్నారు? అని సగటు మనిషి ప్రశ్నిస్తున్నారు.