Begin typing your search above and press return to search.

నిమ్మకాయల నమ్మకాన్ని తిట్టి విపక్షాలు సాధించేదేమిటి?

By:  Tupaki Desk   |   12 Oct 2019 1:30 AM GMT
నిమ్మకాయల నమ్మకాన్ని తిట్టి విపక్షాలు సాధించేదేమిటి?
X
మోడీ పాలనను తలపండిన రాజకీయనేతలు.. మేదావులు.. బుద్ధజీవులు.. తలలో గుజ్జు ఉందని చెప్పే సినీరంగ ప్రముఖులతో పాటు.. చాలామంది తప్పు పడతారు. కానీ.. వారెంత తప్పు పడతారో.. ఆయన అంతకంతకూ బలపడుతుంటారు. మేధావులు ఏ మాత్రం ఒప్పుకోని మోడీని కోట్లాది మంది దేశ ప్రజలు మాత్రం నీరాజనాలు పట్టటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే పనిగా పలువురు విశ్లేషిస్తుంటారు.

కోట్లాది సామాన్యల మనసుల్ని దోచేసే మోడీ.. మేధావుల్ని ఎందుకు ఎందుకు ఆకట్టుకోరు? అంటే అందుకు ఆసక్తికర అంశాల్ని చెబుతుంటారు. అలాంటి ఉదంతం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. దీన్ని చూస్తే.. విపక్షాలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయో ఇట్టే అర్థం కాక మానదు.
భారత అమ్ములపొదిలో రఫెల్ యుద్ధ విమానం చేరబోతున్న విషయం తెలిసిందే. దసరా నేపథ్యంలో దానికి ఆయుధ పూజ చేయటంతో పాటు.. భారత దేశానికి హ్యాండోవర్ చేస్తున్న వేళ.. దాన్ని తీసుకునేందుకు కేంద్ర రక్షణ శాఖామంత్రిరాజ్ నాథ్ వెళ్లారు. రఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కు అధికారికంగా అప్పజెప్పిన తర్వాత దాన్ని ప్రారంభించేందుకు పసుపుకుంకుమ బొట్లు పెట్టి.. నిమ్మకాయలు తొక్కించి స్టార్ట్ చేయించారు.

దీనికి సంబంధించిన వార్తలు.. ఫోటోలు వచ్చాయి. కొందరు ఈ ఫోటోలకుపేరడీ ఫోటోలు తయారు చేసి కాస్తంత కామెడీ చేశారు. అయితే.. ఇదంతా గుప్పెడు మంది మాత్రమే చేస్తే.. మిగిలిన వారంతా మాత్రం సంతోషపడిపోయారు. కోట్లాదిమంది నమ్మే సెంటిమెంట్లకు అనుగుణంగా రఫెల్ కు పూజలు చేయటాన్ని హర్షించాచు.

మేదావులుతో పాటు విపక్షాలు సైతం కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిమ్మకాయలు పెట్టి. .రఫెల్ ను స్టార్ట్ చేయించటాన్ని తప్పు పట్టారు. విమర్శలు చేశారు. మరికొందరు ఎటకారం చేససుకున్నారు. అయితే.. ఇక్కడ చెప్పేదేమంటే.. రాజ్ నాథ్ నిమ్మకాయలు పెట్టి తొక్కించిన పనిని దేశంలోని కోట్లాది మంది నమ్ముతారన్నది మర్చిపోకూడదు. అంటే.. దేశ ప్రజలు తమ సెంటిమెంట్ గా భావించే పనిని రాజ్ నాథ్ చేశారు. అలాంటప్పుడు దాన్ని ఎటకారం చేసుకోవటం అంటే.. ప్రజల నమ్మకాన్ని కామెడీ చేసుకోవటమే.

ఎవరెన్ని మాటలు చెప్పినా.. వారెంత మేధావులు.. బుద్ధజీవులు అయినా.. వారి ఇంట్లోని వారే.. వారి నమ్మకాల్ని ప్రశ్నించటం కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? దేశంలో ఎంతమంది తమ కొత్త వాహనాల్ని నిమ్మకాయలు తొక్కించకుండా స్టార్ట్ చేస్తారు చెప్పండి? ఒకవేళ ఇంట్లో ఉన్న పెద్దాయనకు నమ్మకం లేదన్నా.. ఆయన సతీమణో.. లేదంటే ఇంట్లోని కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పి నిమ్మకాయలు తొక్కించటం చేస్తుంటారు. ఎందుకిలా అంటే.. అది వారి సెంటిమెంట్. రాజ్ నాథ్ కూడా తనకున్న సెంటిమెంట్ ను ప్రదర్శించారు.

భారత దేశ ప్రభుత్వం తరఫున ఇలా చేయొచ్చా? అన్నది మరికొందరు ప్రశ్న. ఇలా చేయటం ద్వారా దేశ పరువును తీసి పారేశారన్న ఆవేదన కొందరు వ్యక్తం చేస్తుంటారు. నిమ్మకాయలతో మనం నవ్వుల పాలు అయ్యామని చెప్పేటోళ్లు కూడా లేకపోలేదు. అయితే.. ఇదంతా కోట్లాది మంది పట్టించుకోని విషయంగా చెప్పాలి. ఈ కారణంతోనే తమకున్న సెంటిమెంట్లను పాటిస్తూ మోడీ అండ్ కో సాగిపోతుంటే.. మరోవైపు ఇలాంటి వాటిని ఎటకారం.. ఎక్కెసం చేయటం ద్వారా విపక్షాలు ప్రజలకు మరింత దూరం అవుతున్నాయని చెప్పక తప్పదు.

నిమ్మకాయలు పెట్టిన వైనంపై తనపై వస్తున్న విమర్శలకు రాజ్ నాథ్ సింగ్ రియాక్షన్ చూస్తే.. జనాలు తమకు నచ్చినట్లు మాట్లాడతారు. నేను చేసే పని సరైనదని అనిపించినప్పుడు ఎవరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ నేను కొనసాగిస్తాను. ఒక గొప్ప అతీతశక్తి ఉందని చిన్నతనం నుంచి నమ్ముతాను.. నాతో పాటు దేశంలో చాలామంది దీన్ని విశ్వసిస్తారు.. మన దేశంలో వాహనాలు.. ఆయుధాలు కొన్న తర్వాత పూజ చేయించటం.. ఓం రాయటం.. నిమ్మకాలు పెట్టి తొక్కించటం అలవాటు. ఆ ఆచారాన్ని పాటించాను.. నచ్చిన దైవాన్ని ప్రార్థంచే హక్కు రాజ్యంగం మనకు కల్పించింది కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజ్ నాథ్ మాటల్ని వింటే కన్వీన్స్ కావటం ఖాయం. ఆ టైంలో విపక్షాల మాటలు.. వారి సిద్ధాంతాలు మనకు చాలా దూరమైనవిగా కనిపించక మానవు. ఇదే.. దేశ ప్రజల్ని మోడీ పరివారానికి దగ్గర చేస్తుంటే.. విపక్షాల్ని దూరం చేస్తున్నాయని చెప్పకతప్పదు.