Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ దుస్థితికి ఇదే పెద్ద నిదర్శనం

By:  Tupaki Desk   |   9 July 2019 8:45 AM GMT
కాంగ్రెస్ దుస్థితికి ఇదే పెద్ద నిదర్శనం
X
పదేళ్లుగా దేశానికి ప్రధానిగా చేసిన వ్యక్తి ఆయన.. ఆర్థికవేత్తగా 90వ దశకంలో దేశాన్ని పరుగులు పెట్టించిన ఆర్థిక సంస్కర్త ఆయన. అలాంటి వ్యక్తిని ఇప్పుడు రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది. అష్టకష్టాలు పడుతోంది. బాబ్బాబు ప్లీజ్ అంటూ ప్రాంతీయ పార్టీలను బతిమిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ కు వచ్చిన ఆ కష్టమేంటంటే..?

మన్మోహన్ సింగ్ రాజ్యసభ కాలపరిమితి ముగిసిపోయింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీగా ఆయన పోటీచేశారు.అయితే ఈశాన్య రాష్టాల్లో కాంగ్రెస్ తుడుచుపెట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో నుంచి మన్మోహన్ ను రాజ్యసభకు పంపే వీలు లేకుండా పోయింది.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్- మధ్యప్రదేశ్- చత్తీస్ ఘడ్ లలో ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీల సీట్లు ఖాళీగా లేవట.. ఇలా మన్మోహన్ ను రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ కష్టాలు పడుతోంది.

తన మిత్రపక్షమైన డీఎంకే సాయాన్ని కూడా కోరిందట కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్- అహ్మద్ పటేల్ లు డీఎంకే అధినేత స్టాలిన్ ను కోరారట.. కానీ కిందిస్థాయి నేతలు కోరడంతో డీఎంకే అధినేత రాజ్యసభ సీటు ఇచ్చేందుకు నో చెప్పారట.. సోనియా- రాహుల్ కోరితే పరిస్థితి వేరుగా ఉండేదన్న చర్చ సాగుతోంది.

అయితే ఇటీవలే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మదన్ లాల్ మరణించారు. ఆయన రాజస్థాన్ నుంచి పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో మన్మోహన్ ను పంపాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మన్మోహన్ ను గెలిపించుకోవడం సులువే.

అయితే 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఓ కురువృద్ధుడిని రాజ్యసభ ఎంపీగా పంపడానికి ఇంత ఆపసోపాలు పడడాన్ని దేశంలో కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతోందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.