Begin typing your search above and press return to search.

యూపీలో ‘వంద’ మీదే కాంగ్రెస్ ఆశలన్నీ

By:  Tupaki Desk   |   19 Aug 2016 9:03 AM GMT
యూపీలో ‘వంద’ మీదే కాంగ్రెస్ ఆశలన్నీ
X
కొన్ని లెక్కలు వినేందుకు కాస్త చిత్రంగా అనిపిస్తాయి. అయితే.. అలాంటి లెక్కలన్నీ కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకుల నుంచి రావటం కనిపిస్తుంది. మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించటం.. అధికార పీఠం కూర్చునే వారికి తన అవసరం ఉండేలా చేసుకోవాలన్న తహతహ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇందుకోసం గడిచిన కొద్ది నెలలుగా చాలానే కసరత్తు చేస్తోంది.

మరింత ప్రయత్నం చేస్తున్న ఆ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో ఏమైనా బలం ఉందా? అంటే.. అంత లేదనే చెప్పాలి. అయితే.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే యూపీలో తాము ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తామన్న ఆశల్ని ఆ పార్టీ భారీగా పెట్టుకుంటోంది. బ్రాహ్మణులు.. ఓబీసీలు.. మైనార్టీల్ని ఆకర్షించటం ద్వారా భారీ సీట్లు కొల్లగొట్టేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా యూపీలో బ్రాహ్మణులకు అత్యధిక సీట్లు కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వంద సీట్లు ఏకంగా బ్రాహ్మణులకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. బ్రాహ్మణుల మీద ఆశలుపెట్టుకుంటున్న ఆ పార్టీ అందుకు తగ్గట్లే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను ఎంపిక చేసుకుంది. బ్రాహ్మణుల మనసుల్ని దోచుకోవటం.. ఓబీసీలకు ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో పాటు.. మైనార్టీల సాయంతో యూపీలో పాగా వేయాలని భావిస్తోంది. బ్రాహ్మణుల మీద భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వ్యూహం వర్క్ వుట్ అవుతుందా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.