Begin typing your search above and press return to search.

బ‌స్సు యాత్రతో కాంగ్రెస్ ద‌శ తిరిగేనా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 8:19 AM GMT
బ‌స్సు యాత్రతో కాంగ్రెస్ ద‌శ తిరిగేనా?
X
ప‌దేళ్ల క్రితం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇప్ప‌టితో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉండేది. నాడు రాష్ట్రంలో ఆ పార్టీదే అధికారం. ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అప్ప‌ట్లో జోరు మీదున్నారు. అంతా తానై పార్టీని మ‌ళ్లీ గెలిపించుకున్నారు. తిరిగి ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్కారు. వైఎస్‌ మ‌ర‌ణం, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించి రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పై ఆగ్ర‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఘోర ప‌రాజ‌యం చ‌విచూపించారు. దాదాపుగా ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిన‌ట్లుగా మారాయి ప‌రిస్థితులు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌ధాన పోటీ టీడీపీ, వైసీపీ మ‌ధ్యే. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఉన్నా.. అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఆ పార్టీ ఇంకా ఎద‌గ‌లేదు. హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రాన్ని మోసం చేశారంటూ క‌మ‌ల‌నాథుల‌పై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కాబ‌ట్టి బీజేపీ కూడా ఊసులో లేన‌ట్లే. మ‌రి కాంగ్రెస్ ప‌రిస్థితేంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎంత‌మేర‌కు పోటీనిస్తుంది? ఎన్ని సీట్లు గెల్చుకుంటుంది? తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించి రాష్ట్రాన్ని క‌ష్టాల్లోకి నెట్టేసింద‌న్న‌ కోపం కాంగ్రెస్ పై ప్ర‌జ‌లు ఇంకా ఉందా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నీ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారాయి.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇటీవ‌లే త‌మ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి టీడీపీతో జ‌ట్టు క‌ట్టి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగింది. మ‌రోసారి ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. ఏపీలో మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు కుద‌ర‌లేదు. దీంతో ఒంట‌రిగానే కాంగ్రెస్ బ‌రిలో దిగుతోంది. ఇన్నాళ్లూ టీడీపీతో పొత్తు ఉంటుందా? లేదా? అనే సంగ‌తి స్ప‌ష్టంగా తెలియ‌క అయోమ‌యంలో ఉన్న కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు ఒంట‌రిగానే పోటీ చేయ‌బోతున్న‌ట్లు స్ప‌ష్ట‌త రావ‌డంతో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెడుతున్నారు.

ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మంగ‌ళ‌వారం నుంచి బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌బోతోంది. అనంత‌పురం జిల్లాలోని మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభ‌మై మొత్తం 13 రోజులపాటు 13 జిల్లాల్లో ఈ యాత్ర కొన‌సాగుతుంది. మార్చి 3న ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2,251 కిలోమీటర్ల పొడవున యాత్ర జ‌రుగుతుంది. యాత్ర‌లో భాగంగా 54 బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు ఈ యాత్ర‌లో వీలును బ‌ట్టి పాల్గొన‌నున్నారు. రాహుల్ ఈ నెల 26 లేదా 27న ఏపీకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. బ‌స్సు యాత్ర రాష్ట్రంలో త‌మ ద‌శ‌ను మార్చుతుంద‌ని.. తిరిగి పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు విశ్వాసంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో టీడీపీతో కాంగ్రెస్ కు పొత్తు ఉన్న నేప‌థ్యంలో బ‌స్సు యాత్ర‌లో, బ‌హిరంగ స‌భ‌ల్లో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఎలాంటి విమ‌ర్శ‌లు గుప్పిస్తార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.