Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. డ్యామేజ్ కంట్రోల్!

By:  Tupaki Desk   |   28 April 2019 2:30 PM GMT
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. డ్యామేజ్  కంట్రోల్!
X
'మోడీ మీద ప్రియాంక ఎందుకు పోటీ చేయలేదు?' అనే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోలింగ్ మొదలుపెట్టింది. మామూలుగా అయితే ఇది చర్చే కాదు. మోడీ మీద కాంగ్రెస్ వాళ్లు ఎవరో ఒకరిని పోటీ పెడితే - ఆ అంశం మీద చర్చించుకోవడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఈ వ్యవహారాన్ని ముందుగా కెలికింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే!

స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ ఈ అంశం మీద కెలుకుడు మొదలుపెట్టింది. తామేదో ఘన కార్యం చేస్తున్నట్టుగా మోడీని - బీజేపీని బెదరగొడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు కలరింగ్ ఇచ్చారు. అయితే చివరకు వారే వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఎదురుప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్లు.

తను మోడీ మీద పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ప్రకటించి ప్రియాంక వాద్రా ఈ అంశంపై చర్చకు తెరలేపింది. మోడీ మీద ప్రియాంక పోటీ చేయడం అంటే అది సంచలన అంశమే. ఆ అంశం గురించి ఎవరో అనామకులు మాట్లాడి ఉంటే అదో ముచ్చట. దానిపై స్వయంగా ప్రియాంక మాట్లాడారు - రాహుల్ గాంధీ మాట్లాడారు!

మోడీ మీద ప్రియాంక పోటీకి సై అన్నారు - రాహుల్ ఏమో సస్పెన్స్ అన్నారు. చివరికేమో తుస్ మన్నారు. మోడీ మీద ప్రియాంక పోటీ చేయడం లేదన్నారు. ఇదే అదునుగా బీజేపీ వాళ్లు ఎద్దేవా మొదలుపెట్టారు. మీడియాలో కూడా ప్రియాంక ఎందుకు వెనక్కు తగ్గిందనే అంశంపై విశ్లేషణలు మొదలుపెట్టింది.

ఎన్నికల వేళ ఇలాంటి సెల్ఫ్ గోల్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నిస్తోంది. ప్రియాంక పోటీ చేయకపోవడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఒక కాంగ్రెస్ నేత ప్రకటించేశారు. తాజాగా ప్రియాంక స్పందిస్తూ తను పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయం అన్నారు. పార్టీ తనకు వేరే బాధ్యతలు అప్పగించిందని అందుకే తను మోడీ మీద పోటీకి దిగలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు!

ఇదీ కథ. రెండు రకాల సమాధానాలతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎంతగా పాట్లు పడుతుందో అందరికీ అర్థం అవుతోంది!