Begin typing your search above and press return to search.

ఏపీలో వాడిన ఫార్ములా కేసీఆర్‌ పై వాడుతున్నారు

By:  Tupaki Desk   |   22 April 2016 6:35 AM GMT
ఏపీలో వాడిన ఫార్ములా కేసీఆర్‌ పై వాడుతున్నారు
X
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన ప్రాబల్యం చాటుకోలేకపోతోంది. అధికార టీఆర్ ఎస్‌ పార్టీ వ్యూహాల ముందు హస్తం నేతలు చిత్తవుతున్నారు. వరస పరాజయాలకు తోడు...నాయకుల వలసలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలతో జనాల్లోకి వెళ్లినా.. కేసీఆర్‌ ప్రజాకర్ష‌ణ పథకాల ముందు నిలవడం లేదు. జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడ జరిగినా గులాబీకే పట్టం కడుతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ పథకాలు - విధానాలపై విమర్శలను నమ్ముకున్న కాంగ్రెస్‌ ఇక లాభం లేదనుకుని ట్రెండ్‌ మార్చుతోంది.

తెలంగాణలో అధికార పార్టీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఉద్యమాల వైపు మళ్లుతోంది. ప్రస్తుత సమకాలీన దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అంశమిదే అన్న‌ది తెలిసిన విష‌యమే.రిజర్వేషన్ల కోసం అధికార పార్టీలను గుజ్జర్లు ముప్పుతిప్పులు పెట్టి సాధించుకున్నారు. గుజరాత్‌ లో పటేల్‌ సామాజిక వర్గం, మ‌రో రాష్ట్రంలో జాట్ల గొడ‌వ కొన‌సాగుతోంది. ఇలాంటి వివాదాలు కమలానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కాపు ఉద్యమం ముప్పుతిప్పలు పెట్టింది.

తెలంగాణలో కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే ప్రత్యేక కోటా ఉద్యమం కాకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు ఇస్తామన్న రిజర్వేషన్ల కోసం ప్రజా ఉద్యమం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గిరిజన హక్కులపై కూడా పోరాటానికి సన్నద్దమైంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేస్తూ హామీ ఇచ్చి మాట తప్పారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇంతకాలం ఈ వ్యవహారంలో విమర్శలతో సరిపెట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు బ్రహ్మాస్తంగా మలుచుకుంటోంది. టిఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ముస్లిం రిజర్వేషన్‌ కు ఉద్యమరూపం ఇవ్వాలనుకుంటోంది. అధికార పార్టీ ఇచ్చిన హామీనే కాబట్టి ఓ వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమించినా ఇతర వర్గాల్లో వ్యతిరేకత ఉండదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 4శాతం ఇచ్చిన అంశాన్ని కూడా నేత‌లు ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. అటు గిరిజనుల హక్కులపై కూడా కాంగ్రెస్ దృష్టిసారించింది. ఆయా వర్గాలను సమాయత్తం చేసి ఉద్యమాలను ముందుండి నడిపించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదన్న భావనలో ఉంది. వలసలను కట్టడి చేయడంతో పాటు.. టీఆర్‌ ఎస్‌ హామీలను నమ్మి అండగా నిలిచిన వివిధ‌ వర్గాలను తిరిగి తనదారికి తెచ్చుకోవాలనుకుంటోంది. మరి ఇది వర్కవుట్‌ అవుతుందా? దీనితో అయినా హస్తం రేఖలు మారి.. పార్టీ తన ప్రాబల్యం చాటుకుంటుందా? రాజకీయ పార్టీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నడిపించగలదా? కోటాల కోట్లాటలో దిగి మిగతా వర్గాలను కూడా కలుపుకుని నెగ్గుకరాగలదా? వేచి చూడాల్సిందే.