Begin typing your search above and press return to search.

హ‌స్తం అభ‌యం..ఏపీకి ప్ర‌త్యేక హోదా ఖాయం!

By:  Tupaki Desk   |   23 July 2018 4:05 AM GMT
హ‌స్తం అభ‌యం..ఏపీకి ప్ర‌త్యేక హోదా ఖాయం!
X
పోయిన చోటే వెతుక్కోవాలి. తెలుగు వారికి సుప‌రిచిత‌మైన సామెత‌. ఈ సామెత‌నే కాంగ్రెస్ పార్టీ న‌మ్ముకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏపీని దెబ్బేస్తూ రాష్ట్ర విభ‌జ‌న‌కు తీసుకున్న నిర్ణ‌యం ఆ పార్టీని ఎంత దారుణంగా దెబ్బ తీసిందో తెలిసిందే. ఇప్పుడ‌దే అంశంతో పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకునే దిశ‌గా అడుగులు వేసింది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు కీల‌క‌మైన సీడబ్ల్యూసీ స‌మావేశ‌మే.. తాజాగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇచ్చే అంశంపై సానుకూలంగా స్పందించింది. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల‌న్న నిర్ణయాన్ని తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ డిసైడ్ చేసింది.

మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా.. దేశ వ్యాప్తంగా ఉద్య‌మించాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ వేళ‌.. మొత్తం ప‌ది అంశాల్ని తీర్మానాలుగా చేసింది. ఇందులో.. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు.. విభ‌జ‌న హామీల‌న్ని తీర్చ‌టం ఒక‌టి కావ‌టం గ‌మ‌నార్హం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఏర్పాటు చేసిన తొలి సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా మీద చ‌ర్చ జ‌రిగింది.

ఈ చ‌ర్చ‌లో ఏపీతో పాటు వెనుక‌బ‌డి ఉన్న బిహార్‌.. ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయ‌ని.. ప్ర‌త్యేక హోదా క‌ల్పించే అంశంపై పోరాడాల‌ని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజ‌న్ ప‌ట్నాయ‌క్ వాదించారు. ఈ వాద‌న‌ను మొద‌ట్లోనే రాహుల్.. సోనియాగాంధీలు అడ్డుకోవ‌టం గ‌మ‌నార్హం.

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీ ఆర్థికంగా ఎంత‌గానో న‌ష్ట‌పోయింది. ఆ రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది. అందుకే ఆ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా క‌ల్పించాల‌ని హామీ ఇచ్చాం. ఆ రాష్ట్రం ఇత‌ర రాష్ట్రాల్ని పోల్చేందుకు వీల్లేద‌ని సోనియాగాంధీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చామ‌ని.. ఆ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. హోదా హామీకి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. ఇప్పుడే కాదు.. భ‌విష్య‌త్తులోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఎవ‌రూ మాట్లాడ‌టానికి వీల్లేద‌ని రాహుల్ తేల్చి చెప్పారు.

ఇక‌.. సీడ‌బ్ల్యూసీలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన 10 అంశాలు చూస్తే..

1. దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. మోడీ మోసపూరిత వ్యాఖ్యలను ఎండ‌గ‌ట్టాలి.

2. నిరుద్యోగ యువతలోని సందిగ్థ‌తను తొలగించ‌కుండా.. ప‌కోడీలు.. పాన్ లు అమ్మాల‌న‌టంపై భారీ ప్ర‌చారం

3. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. ప‌రిశ్ర‌మ‌ల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపేందుకు ప‌రిష్కారం క‌నుక్కోవాలి

4. ద‌ళితులు.. గిరిజ‌నుల‌పై దాడులు జ‌ర‌గ‌టం ఆందోళ‌న‌క‌ర‌మైన అంశం. వారికి సంఘీభావం తెల‌పాలి.

5. అత్యంత వెనుక‌బ‌డిన వ‌ర్గాల దుర్భ‌ర స్థితిని తొల‌గించాలి..మ‌హిళ‌ల‌పై పెరిగిన అత్యాచారాల‌కు అడ్డుక‌ట్ట

6. దేశంలో కొన్ని మూక‌లు శాంతిభ‌ద్ర‌త‌ల్ని చేతిలో తీసుకొని హింసాకాండ‌కు దిగుతున్నాయి. వారికి చెక్ పెట్టాలి

7. విదేశాంగ విధానం అస్త‌వ్య‌స్తంగా మారి.. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త ప్ర‌మాదంలో ప‌డింది. దీన్ని చ‌క్కదిద్దాలి

8. వ్య‌వ‌స్థ‌లు.. సంస్థ‌లు నిర్వీర్యం అయ్యేలా చేస్తున్న వైనానికి వ్య‌తిరేకంగా పోరాడాలి

9. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించ‌టం త‌ప్ప‌నిస‌రి. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ఇచ్చిన హామీల్ని పార్టీ నెర‌వేరుస్తుంది. ఏపీకి హోదా విష‌యంలో పార్టీ నేత‌లు ఎవ‌రూ వ్య‌తిరేకంగా మాట్లాడొద్దు.

10. దేశంలో తీవ్ర‌వాదం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే ఘ‌ట‌న‌ల‌కు చెక్ పెట్టాలి