Begin typing your search above and press return to search.

అర్జునుడితో ఆపుతారా?.. మరిన్ని అవతారాలా?

By:  Tupaki Desk   |   13 Sep 2016 5:52 AM GMT
అర్జునుడితో ఆపుతారా?.. మరిన్ని అవతారాలా?
X
మాటలు.. చేతలు ఎలా ఉన్నా.. నిత్యం ‘లౌకిక’ మాటలు మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు అలవాటే. మిగిలిన పార్టీల మాదిరి పురాణ పురుషులతో పోల్చుకునే విధానం దాదాపుగా కనిపించదు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ యువరాజు.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అర్జునుడిగా పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యూపీలో సుదీర్ఘ యాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే.

మరికొద్ది నెల్లలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన యూపీ మొత్తాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా తన రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖాట్ భేటీ అంటూ తన సభల్లో మంచాల్ని ఏర్పాటు చేసి రైతులతో ముచ్చట్లు పెట్టాలన్న ప్లాన్ అట్టర్ ప్లాప్ కావటమేకాదు.. కామెడీ షోగా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఆయన్ను అర్జునుడి అవతారంలో ఫ్లెక్సీని తయారు చేయించటం వివాదాస్పదంగా మారింది. అహ్మదాబాద్ కు రానున్నరాహుల్ కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు కాసింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అర్జునుడి రూపంలో ఫ్లెక్సీని తయారు చేయించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫ్లెక్సీలో బాణం ఎక్కుపెట్టిన అర్జుడిలా చిత్రీకరిస్తూ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీ గురించి తమకు తెలీదని యూపీ కాంగ్రెస్ నేతలు చెప్పటం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి ఫ్లెక్సీలతో తమ పార్టీపై ఉన్న ‘లౌకిక’ బ్రాండ్ ఎక్కడ మిస్ అవుతుందోనన్న భయాందోళనల్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ను అర్జునుడితో ఆపితే సరే. మరిన్ని అవతారాల్లో ఆయన్ను చూపిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందంటున్నారు.