Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర‌లో మ‌రో క‌ల్లోలం.. అజిత్ పవార్ పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఫైర్!

By:  Tupaki Desk   |   24 Jun 2022 9:30 AM GMT
మ‌హారాష్ట్ర‌లో మ‌రో క‌ల్లోలం.. అజిత్ పవార్ పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఫైర్!
X
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌-నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ స‌ర్కారులోని లుక‌లుక‌ల‌న్నీ నెమ్మ‌దిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్పటివరకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతోనే సమస్య అనుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వ‌చ్చింది.

శివ‌సేనకు చెందిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్సీపీపై ఇవే ఆరోపణలు చేస్తోంది. మ‌హారాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని వేధిస్తున్నార‌ని నానా ప‌టోల్ మండిప‌డుతున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు రాకుండా ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ద్ద అజిత్ పవార్ అడ్డుప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము అజిత్ ప‌వార్ ప్రయత్నాల్ని అడ్డుకున్నామ‌ని నానా ప‌టోల్ చెబుతున్నారు.

రాజకీయం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే తాము శివ‌సేన‌-ఎన్సీపీ స‌ర్కారుకు మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని తెలిపారు. అయితే, ఈ సంక్షోభ స‌మ‌యంలో మాత్రం తాము శివసేన వెంటే ఉంటామ‌ని మ‌హారాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు నానా ప‌టోల్ అంటున్నారు. బీజేపీని ఎట్టి ప‌రిస్థితుల్లో అధికారంలోకి రానీయ‌బోమ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఒకవేళ శివసేన ఎవరితోనైనా కలవాలి అనుకుంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేద‌ని కూడా నానా పటోల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్సీపీపై ఆరోపణలు చేస్తుంటే, తాజాగా నానా పటోల్ చేసిన వ్యాఖ్యలతో వారి వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. మహా ప్రభుత్వంలో శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఆధిపత్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది.

మ‌రోవైపు శివ‌సేన అస‌మ్మ‌తి శిబిరంలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం రెబ‌ల్ నేత ఏక‌నాథ్ షిండే వెంట 40 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు, 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం వీరంతా అసోంలోని గువ‌హ‌టిలో ఉన్న రాడిస‌న్ బ్లూ ప్లాజాలో ఉన్నారు.