Begin typing your search above and press return to search.

సీతక్క వారసుడొచ్చాడు..

By:  Tupaki Desk   |   4 Jan 2023 2:06 PM GMT
సీతక్క వారసుడొచ్చాడు..
X
తెలంగాణ కాంగ్రెస్ లో నీతికి నిజాయితీకి నిస్వార్థ ప్రజాసేవకు మారు పేరు సీతక్క. అందరిపై ఏదో ఒక ముద్ర వచ్చినా సీతక్క సేవానిరతికి మాత్రం ఇప్పటికీ ప్రశంసలు కురుస్తుంటాయి. ఆమె విప్లవ నేపథ్యంలో.. ప్రజల్లో కలిసిపోయే నైజం.. నిరాడంబరత .. రాజకీయాల్లో వేసిన అడుగులు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తెలంగాణలో పార్టీలకు అతీతంగా సీతక్క ఎంతో పేరు సంపాదించారు.

అలాంటి సీతక్క ఇప్పుడు తన రాజకీయ వారసుడిని తెరపైకి తెస్తున్నారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యను పినపాక నుంచి పోటీచేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పినపాక నుంచి కుమారుడికి టికెట్ తెచ్చుకోగలననే ధీమాను సీతక్క వ్యక్తం చేస్తున్నారు. సీతక్క కుమారుడు సూర్య కొద్దినెలలుగా పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ క్యాడర్ ను బలోపేతం చేస్తున్నాడు. ఇటీవల గుండాలలో పర్యటించి తన పోటీ గురించి మాట్లాడాడు. పార్టీ ఆదేశిస్తే పినపాక నుంచే తాను బరిలోకి దిగుతానని సూర్య అన్నారు.

ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గం భాగంగా ఉండేది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం ఇది. ప్రస్తుతం పినపాక ఎమ్మెల్యేగా ఉన్న రేగ కాంతారావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తినే. 2018లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వేంకటేశ్వరులుపై సుమారు 20వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అనంతరం రేగా కాంతారావు 2019లో టీఆర్ఎస్ లో చేరారు.

ఇక 2014 ఎన్నికలలో పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2009లో రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.

ఇక ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సీతక్క ఉన్నారు. ఈ ములుగుకు పక్క నియోజకవర్గమే ‘పినపాక’. రెండూ కూడా మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. రెండూ ఎస్టీ నియోజకవర్గాలే. సీతక్కకు పినపాకలో కూడా మంచి పట్టుంది. ఇవన్నీ తన కుమారుడు సూర్యను గెలిపించుకోవడానికి సహకరించే అంశాలు. ఈ నేపథ్యంలో సూర్యకు పినపాక టికెట్ కోసం సీతక్క ప్రయత్నిస్తోంది. గెలుపు బాధ్యత తీసుకుంటానని కాంగ్రెస్ కు చెబుతోంది. మరి అధిష్టానం ఇస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.