Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ వార్త‌ల్లోకి జానారెడ్డి!

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:48 AM GMT
మ‌ళ్లీ వార్త‌ల్లోకి జానారెడ్డి!
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం గ‌ల ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్రంలో హోంమంత్రిగా విధులు నిర్వ‌ర్తించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో 2014-19 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే ప్ర‌తిప‌క్ష నేత‌గా అధికార పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల్సింది పోయి.. అధికార పార్టీ పైనే ప‌లుమార్లు ప్ర‌శంస‌లు కురిపించి అంద‌రినీ విస్మ‌యానికి గురిచేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన త‌ర్వాత జానారెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అధికార పార్టీతో మెతక వైఖరి అవలంభించారని జానా మీద అప్ప‌ట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇంత‌కాలం రాజ‌కీయాల‌కు కాస్త దూరంగానే ఉన్న ఆయ‌న తాజాగా మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నూతన గవర్నర్ గా నియమితులైన బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయను ఆయన మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. హైద‌రాబాద్‌ లోని ద‌త్త‌న్న నివాసానికి వెళ్లి.. ఆయనకు శుభాకాంక్షలు తెల‌ప‌డంతో ఈ అంశం రాజ‌కీయ రంగు పులుముకుంది.

ప్రస్తుతం బీజేపీలోకి వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌టంతో వీరిద్ద‌రి భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ అంశం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు - ఊహాగానాల‌కు తెర‌లేప‌గా - కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రకంపనలు సృష్టించింది. అయితే దీనికి రాజకీయ ప్రాధాన్య‌త ఏమీ లేదని - కేవలం మర్యాదపూర్వకంగానే దత్తాత్రేయని కలిశారని జానారెడ్డి అనుయాయులు పేర్కొంటున్నారు.

సుదీర్ఘ కాలం తెలంగాణలో ప‌నిచేసి బ‌దిలీపై వెళ్తున్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ ను కూడా జానారెడ్డి క‌లిశార‌ని - ఈక్ర‌మంలోనే హిమాచల్ ప్రదేశ్‌ కు వెళ్లనున్న దత్తాత్రేయను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపార‌ని వారు అంటున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుతం జానారెడ్డి అంశం అటు కాంగ్రెస్ పార్టీలో - ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌లేపింది.