Begin typing your search above and press return to search.

తెలంగాణ రావటానికి అసలుసిసలు కారణమైన ఎమ్మెస్సార్ ఇక లేరు!

By:  Tupaki Desk   |   27 April 2021 3:39 AM GMT
తెలంగాణ రావటానికి అసలుసిసలు కారణమైన ఎమ్మెస్సార్ ఇక లేరు!
X
ఇదేం పోయే కాలం? పొద్దుపొద్దున్నే ఇలా ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే రోజులు పోయి.. నాలుగు మాటలతో మమ అనిపించే పాడు అలవాటు మీడియాలో చాలామందికి వచ్చేసింది. గతంలో ఏం జరిగింది? వర్తమానంలో ఏం జరుగుతోంది? భవిష్యత్తులు ఏం జరిగే అవకాశం ఉందన్న కనీస ఆలోచన లేని వారంతా మీడియాలోకి రావటం.. జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పటం తప్పించి.. దాని వెనుక ఏం జరిగిందన్న కనీస వివరాల్ని అందించే పరిస్థితి ఈ రోజున మీడియాలో లేదనే చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ అధ్యక్షుడిగా.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఒక వెలుగు వెలిగిన ఎం సత్యనారాయణరావ్ (88) ఈ తెల్లవారుజామున (మంగళవారం) నిమ్స్ లో కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.45 గంటల వేళలో తుదిశ్వాస విడిచారు.

కరీంనగర్ జిల్లాలోని వెదిరే గ్రామంలో పుట్టిన ఆయన.. రాజకీయాల్లో పలు పదవుల్ని చేపట్టారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. 1971లో తొలిసారి తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా గెలిచారు. తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. 2000 -2004 వరకు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా.. 2007 తర్వాత ఆర్టీసీ ఛైర్మన్ గా వ్యవహరించారు.

ఎం. సత్యనారాయణరావ్ అలియాస్ ఎమ్మెస్సార్ గా సుపరిచితుడైన ఆయన.. ఒక దశలో మీడియాలో ప్రధాన కేంద్రంగా ఉండేవారు. ఆయన నోరు విప్పితే చాలు.. సంచలనం అయ్యేది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం.. తన మనసులోని మాట మాట్లాడేందుకు ఏ మాత్రం వెరవని ఆయన.. సొంత పార్టీ మీదా.. పార్టీ ప్రముఖుల మీద తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని తత్త్వం ఆయన సొంతం.

ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెస్సార్ ను ఒక చానల్ ప్రతినిధి మాట్లాడించిన సందర్భంలో కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు.. సవాల్ సంచలనంగా మారాయి. అందుకు ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఉప ఎన్నిక పుణ్యమా అని తెలంగాణ వాదం ఒక్కసారిగా పీక్స్ కు వెళ్లటమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ రాజుకోవటానికి కీలకకారణమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయనిది కీలక భూమిక.

ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో కేసీఆర్ అనూహ్య విజయాన్ని సాధించారో.. అప్పటినుంచి ఉప ఎన్నికలతో ఉద్యమాన్ని రాజేసి..దాన్ని లైవ్ లో ఉంచే ప్రయత్నం చేయటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సాధ్యమైంది. ఆయన నోటి నుంచి వచ్చిన సవాలు తెలుగు రాజకీయాల్ని పూర్తిగా మార్చేసింది. ఆయనే కానీ.. మాట్లాడకుండా ఉండి ఉంటే.. కరీంనగర్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగేది కాదు. అదే లేకుండా.. ఇక చెప్పాల్సింది ఏముంది చెప్పండి? అందుకే.. తెలంగాణ సాధనలో కేసీఆర్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల పేర్లు అందరూ చెబుతారు. కానీ.. తెలంగాణ దిశగా అడుగులు పడటానికి ఆయన నోటి నుంచి వచ్చిన మాటే.. మొత్తానికి కారణమైంది. అలాంటి వ్యక్తి ఈ రోజున చనిపోతే.. ఎవరు ఎమ్మెస్సార్? అనే పరిస్థితి పలువురి నోటి నుంచి విన్నప్పుడు.. కాలం ఇలానే ఉంటుందనిపించక మానదు.