Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : రేవంత్ అర్హుడు కాదన్న సోనియాగాంధీ?

By:  Tupaki Desk   |   19 March 2020 5:05 AM GMT
బిగ్ బ్రేకింగ్ : రేవంత్ అర్హుడు కాదన్న సోనియాగాంధీ?
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మంతనాలు సాగిస్తుండగా వారికి ఎంపీ రేవంత్ రెడ్డే కనిపించాడు. పార్టీలో చురుగ్గా ఉండడం.. అధికార పార్టీపై పోరాడడం వంటివి పరిశీలించి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ అభిప్రాయానికి వచ్చారంట. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై పరిణామాలు మారాయి. భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలు బయటపడడంతో అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. వీటన్నిటి పరిశీలించిన అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని ఏఐసీసీ తేల్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రతినిధుల దగ్గర తేల్చిచెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిశారు. ఆ క్రమంలో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలోనే అధిష్టానానికి ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణలోని పార్టీ నాయకులు, వారి శక్తి సామర్థ్యాలతోపాటు వారిపై ఉన్న కేసులు, వ్యక్తిత్వాలపైన ఓ నివేదిక అందజేశారంట. వాటిని పరిశీలించడంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాతోనూ నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. వాటన్నింటిని నిశితంగా పరిశీలించి.. సమాలోచనలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డిని పీసీసీ రేసు నుంచి పేరును తొలగించినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం, ఆయన దూకుడు తనమే కొంప ముంచిందంట. అధికార దాహం, నోటి దురుసు, కక్ష పూరిత చర్యలు వంటి విషయాలతోనే అధిష్టానం అతడిని పక్కన పెట్టినట్లు కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో పార్టీ చీఫ్ అవినీతి కేసుల్లో ఉంటే.. అధికార పార్టీని ఎలా ప్రశ్నిస్తాడు? పార్టీలోనే తప్పుడు సంకేతాలు వెళ్లవా? అంటూ సోనియా ప్రశ్నలు వేయగా మెజార్టీ ఏఐసీసీ సభ్యులు కూడా అది వాస్తవమేనని తెలిపారంట. ఓటుకు నోటు కేసుతో పాటు భూ ఆక్రమణలు వంటివి బయటపడ్డాయని గుర్తుచేశారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీనీ భ్రష్టు పట్టించడా ఏంటీ అంటూ సోనియా ప్రశ్నించారంట. ఇవన్నీ కాదని రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే పార్టీలోనూ అంతర్గత కుమ్ములాటలు మితిమీరే ప్రమాదం ఉందని అంచనా వేశారని రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించినట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. రేవంత్ రెడ్డి మొదటి నుంచి దూకుడు స్వభావి. టీడీపీలోనూ కాంగ్రెస్ లోనూ అదే వైఖరి ఉంది.

ఓటుకు నోటు కేసు, పలు కేసులు వీటన్నిటిని పక్కన పెట్టి ఎంపిక చేస్తే పార్టీలో తీవ్ర విబేధాలు వస్తాయని కాంగ్రెస్ ఊహిస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సీనియర్లకు అసలు పడదు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి కలగజేసుకోవడంపై ఇప్పటికీ ఆ జిల్లా నాయకులు మండి పడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కొమటిరెడ్డి సోదరులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. వారితో పాటు నల్గొండ జిల్లాలో బలమైన నాయకులు, ఇక పార్టీలోని సీనియర్ నాయకులు కూడా పార్టీ వీడే ప్రమాదం ఉంది. వీటన్నిటి ఊహించిన అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవికి అనర్హుడని పేర్కొంటూ పక్కన పెట్టేశారంట. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవికి అనర్హుడిగా తేల్చి చెబుతూ అధిష్టానం ద్వారా ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం కూడా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆ పీఠం ఆశిస్తున్న రేవంత్ రెడ్డికి నిరాశ ఎదురైనట్టే.