Begin typing your search above and press return to search.

పంజాబ్ నుంచి పాఠాలు నేర్వ‌క‌పోతే అంతే గతి!

By:  Tupaki Desk   |   14 March 2022 12:30 AM GMT
పంజాబ్ నుంచి పాఠాలు నేర్వ‌క‌పోతే అంతే గతి!
X
అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్‌కు.. దేశ రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్ అంధ‌కారంగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జాతీయ రాజ‌కీయాల్లో ఆ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారంలో ఉండి కూడా ఓట‌మి పాలు కావ‌డంపై పార్టీలోని సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అస‌మ‌ర్థ నాయ‌క‌త్వమే కార‌ణ‌మంటూ అధిష్ఠానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశం వాడివేడిగా జ‌ర‌గడం ఖాయం.

ఆ విభేదాలే..

మ‌రోవైపు పంజాబ్‌లో పార్టీ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోక‌పోతే తెలంగాణ‌లో పుంజుకోలేమ‌ని టీపీసీసీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాలే పార్టీ కొంప‌ముచ్చాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అదే నిజ‌మ‌న‌డంలో సందేహం లేదు. అమ‌రీంద‌ర్ ఆ పార్టీ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌నికి, న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు మ‌ధ్య‌లైన పోరు ముదిరి ఎన్నో ప‌రిణామాల‌కు దారి తీసింది. అమ‌రీంద‌ర్ పార్టీ వీడాల్సి వ‌చ్చింది. ఆ తర్వాత సీఎం చ‌న్నీ, పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూ మ‌ధ్య విభేదాలు కొన‌సాగాయి. ఇవి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయి.

తెలంగాణ‌లోనూ అలాగే..

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు తెలంగాణ‌లోనూ అలాగే ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక‌వ‌డంతో పార్టీలోని సీనియ‌ర్లు భ‌గ్గుమ‌న్నారు. మొద‌టి నుంచి పార్టీని న‌మ్ముకున్న వాళ్ల‌ను కాద‌ని వేరే పార్టీలో నుంచి వ‌చ్చిన నాయ‌కుడిగా ఎలా ప‌ద‌వి క‌ట్ట‌బెడుతారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అప్ప‌టి నుంచి రేవంత్‌పై సీనియ‌ర్ వ‌ర్గం గుర్రుగానే ఉంది. పార్టీలో ఆయ‌న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకున్నారంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ పంచాయ‌తీ అధిష్టానం వ‌ద్ద‌కూ చేరింది. కానీ అక్కడి నుంచి స్ప‌ష్ట‌మైన చ‌ర్య‌లేమీ లేవు. ఇప్ప‌టికే రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్లు అన్న‌ట్లు పార్టీ ప‌రిస్థితి ఉంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది. నేత‌లంద‌రూ ఒక్క‌టిగా క‌లిసి ప‌నిచేస్తే టీఆర్ఎస్‌కు పోటీనివ్వ‌డం క‌ష్ట‌మేమీ కాదు. కానీ అంత‌కంటే ముందు పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు ముగింపు ప‌ల‌కాల్సి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.