Begin typing your search above and press return to search.

కొత్త పొత్తుకు క్లియర్ సిగ్నల్!

By:  Tupaki Desk   |   8 Aug 2018 8:42 AM GMT
కొత్త పొత్తుకు క్లియర్ సిగ్నల్!
X
వచ్చే ఎన్నికల్లో ఏపీలో చిరకాల ప్రత్యర్థులు టీడీపీ - కాంగ్రెస్‌ లు కలిసి పని చేస్తాయంటే ఇప్పటికీ నమ్మలేనివారున్నారు. కానీ, రోజురోజుకూ దృఢమవుతున్న ఆ రెండు పార్టీల బంధాన్ని చూస్తుంటే ఎన్నికలకు ముందు వారు పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యసభలో తాజాగా జరిగిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికలో జరిగిన పరిణామాలు చూస్తే ఈ రెండు పార్టీల జుగల్‌ బందీ స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఆరుగురు రాజ్యసభ సభ్యులున్న తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేశ్ పోటీ పడితే ఆయనకు ఏకంగా 106 ఓట్లు వచ్చాయి. అదేసమయంలో బీజేపీ నుంచి ఎన్నికైన సభ్యుడు కేవలం 69 ఓట్లే సాధించి ఎలాగోలా గట్టెక్కారు. టీడీపీ నుంచి పోటీ పడిన సీఎం రమేశ్ 106 ఓట్లు సాధించడానికి కారణమెవరంటే... కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు అని స్పష్టంగా అర్థమవుతోంది. మిత్రపక్షాలు సహా కాంగ్రెస్ టీడీపీ సభ్యుడికి మద్దతిచ్చిందంటే చంద్రబాబు యూపీఏలో కలిసిపోయినట్లేనని స్పష్టమవుతోంది.

ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన తరువాత సీఎం రమేశ్ నేరుగా కాంగ్రెస్ సభ్యుల వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు... విపక్షాలన్నీ ఐకమత్యంగా తనను గెలిపించాయని కూడా ఆయన అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్, టీడీపీల దోస్తీని బయటపెడుతున్నాయి.

మరోవైపు ఏపీలో ప్రస్తుత పరిస్థితి చంద్రబాబును అధికారం కావాలంటే ఎలాగైనా కాంగ్రెస్‌తో కలిసివెళ్లేలా తొందరపెడుతోంది. అదేసమయంలో గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రస్ కూడా ఈసారి ఎవరితో కలిసైనా సరే కనీసం ఒక సీటయినా సంపాదించుకోవాలని తెగ తాపత్రయపడుతోంది. ఒకరు అధికారం కోసం.. ఇంకొకరు బోణీ చేయడం కోసం కలిసికట్టుగా సాగడానికి సిద్ధమవుతున్నారు.

పొత్తుల్లేకుండా ఒంటరిపోరు అలవాటులేని చంద్రబాబు ఈసారి ఒంటరైపోయారు. గత ఎన్నికల్లో తోడుగా ఉన్న బీజేపీ, జనసేనలు ఈసారి చంద్రబాబుతో లేవు. దీంతో ఆయన కన్ను కాంగ్రెస్ పై పడింది. బీజేపీని ఎలాగైనా తొక్కాలని నానాపాట్లు పడుతూ ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధపడుతున్న కాంగ్రెస్‌ ను అలాగే వదిలేస్తే అది ఎక్కడ వైసీపీతో కలుస్తుందో అన్న భయం కూడా చంద్రబాబును కాంగ్రెస్‌తో కాపురానికి పురికొల్పుతోంది.