Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ భ‌య‌ప‌డేలా 'రాఫెల్' పై వార్!

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:04 AM GMT
మోడీ బ్యాచ్ భ‌య‌ప‌డేలా రాఫెల్ పై వార్!
X
రాఫెల్ కుంభ‌కోణం ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా అంత‌కంత‌కూ కొత్త విష‌యాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. రాఫెల్ కుంభ‌కోణం గురించి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తొలిసారి గ‌ళం విప్పిన‌ప్పుడు.. దానికి కౌంట‌ర్ వేసేందుకు మోడీ చూపించిన ఉత్సాహాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే దునుమాడుతూ.. రాహుల్ త‌న‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రి.. అదే ఉత్సాహాన్ని ఇప్పుడు ఎందుకు ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు మౌన‌మే స‌మాధానంగా మిగులుతోంది. ఇదిలా ఉంటే.. మోడీ ప‌రివారం మౌనం కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌రింత ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతోంది. దేశ ర‌క్ష‌ణ రంగంలోనే అత్యంత భారీ కుంభ‌కోణంగా ఆరోపిస్తూ.. మోడీ ప‌రివారంపై యుద్ధాన్ని ముమ్మ‌రం చేసింది కాంగ్రెస్‌. 36 యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ స‌ర్కారు దారుణ అవినీతికి పాల్ప‌డిన‌ట్లుగా ఇప్పుడా పార్టీ మండిప‌డుతోంది.

రాఫెల్ స్కాంపై తాజాగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న కాంగ్రెస్‌.. సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు నష్టం వాటిల్లేలా చేయ‌టంతో పాటు దేశ భ‌ద్ర‌త‌ను ప్ర‌మాదంలోకి నెట్టేసేలా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా పేర్కొంది.

ప‌ద‌కొండు మంది స‌భ్యులున్న కాంగ్రెస్ బృందం తాజాగా సీవీసీకి కంప్లైంట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఒక విన‌తి ప‌త్రాన్ని అంద‌జేసింది. రాఫెల్ ప‌త్రాల్ని స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసుకోవాల‌న్న కాంగ్రెస్‌.. భార‌త ర‌క్ష‌ణ రంగంలో రాఫెల్ డీల్ అతి పెద్ద స్కాంగా అభివ‌ర్ణించింది. ఈ డీల్ కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.41,205 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా పేర్కొంది.

క్ష‌మించ‌రాని త‌ప్పు చేసిన‌ట్లుగా మోడీ స‌ర్కారుపై తీవ్రంగా మండిప‌డిన కాంగ్రెస్‌.. 36 రాఫెల్ విమానాల ధ‌ర‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేసింది.హాల్ కు సాంకేతిక‌త బ‌దిలీని నిరాక‌రించ‌టం ద్వారా ఉద్దేశ‌పూర్వ‌కంగా కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్‌.. రాఫెల్ కొత్త డీల్ ను ప్ర‌క‌టించటం ద్వారా డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రోసీజ‌ర్ ను మోడీ ఉల్లంఘించిన‌ట్లుగా పేర్కొన్నారు.

మోడీ ప‌రివారానికి వ‌ణుకు పుట్టేలా సీవీసీని క‌లిసిన కాంగ్రెస్ బృందంలో ఉన్న నేత‌ల్ని చూస్తే.. రాఫెల్ ఇష్యూలో విప‌క్ష పార్టీ ఎంత సీరియ‌స్ గా ఉంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కాంగ్రెస్ బృందంలో ఉన్న అగ్ర‌నేత‌ల్ని చూస్తే..

గులాంనబీ ఆజాద్‌
అహ్మద్‌ పటేల్‌
ఆనంద్‌ శర్మ
కపిల్‌ సిబల్‌
రణదీప్‌ సుర్జేవాలా
జైరాం రమేశ్‌
అభిషేక్‌ సింఘ్వి
మనీశ్‌ తివారీ
వివేక్‌ ఠంకా
ప్రమోద్‌ తివారీ
ప్రణవ్‌ ఝా