Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ కు దిమ్మ తిర‌గ‌టం ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   27 March 2018 6:20 AM GMT
మోడీ బ్యాచ్ కు దిమ్మ తిర‌గ‌టం ఖాయ‌మ‌ట‌!
X
ఏమైనా స‌రే.. సౌత్ లో కాషాయ జెండా ఎగ‌రాల్సిందేనన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది మోడీ ప‌రివారం. ఎంత‌కూ కొరుకుడు ప‌డ‌ని ఈశాన్య భారతంలోనూ కాషాయ జెండా రెప‌రెప‌లాడుతున్న వేళ‌.. సౌత్ ను సైతం త‌మ సొంతం చేసుకోవ‌టానికి త‌హ‌త‌హ‌లాడుతోంది. మోడీ.. షా ద్వ‌యం ఎంత‌గా కోరుకుంటున్నారో.. అంత‌గా వారికి సౌత్ దూర‌వుతున్నట్లుగా క‌నిపిస్తోంది.

మోడీని తాకిన గాలిని త‌మ‌ను తాకినా మండిప‌డుతున్న త‌మిళుల‌కు.. ప్ర‌స్తుతం ఆంధ్రా ప్ర‌జ‌లు జత‌య్యారు. హోదా విష‌యంలో త‌మ‌కు హ్యాండ్ ఇచ్చిన వైనంపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లపై మోడీ ప‌రివారం బోలెడ‌న్ని ఆశ‌ల్ని పెట్టుకుంది.

ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో క‌ర్ణాట‌క పీఠాన్ని సొంతం చేసుకోవ‌టం ద్వారా.. సౌత్ తో రీఎంట్రీ ఇచ్చి..మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని త‌పిస్తున్న మోడీ ప‌రివారానికి దిమ్మ తిరిగేలా స‌ర్వే రిజల్ట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రో రెండు మూడు రోజుల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ను ఈసీ విడుద‌ల చేస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. సీఫోర్ సంస్థ స‌ర్వేను నిర్వ‌హించింది. ఈ ఫ్రీపోల్ స‌ర్వే రిజ‌ల్ట్ చూస్తే.. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి ఏర్ప‌డుతుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. బీజేపీకి ఈసారికి నిరాశ త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

క‌ర్ణాట‌క‌లోని 154 నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్చి 1 నుంచి 25 వ‌ర‌కు ప్రీపోల్ స‌ర్వే నిర్వ‌హించ‌గా.. 2368 పోలింగ్ బూతుల్లో 22357 మంది ఓట‌ర్ల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని శాంపిల్ స‌ర్వే నిర్వ‌హించారు. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 46 శాతానికి పెంచుకొని మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా తేలింది.

అధికారం కోసం భారీ ఆశ‌లు పెట్టుకున్న బీజేపీకి 31 శాతం.. జేడీఎస్ కు 16 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. కాంగ్రెస్ కు 112 నుంచి 126 సీట్లు ప‌క్కా అని.. బీజేపీకి 70 స్థానాలు.. జేడీఎస్ 27 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

ఇక‌.. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర ప‌రిధిలో మొత్తం 28 నియోజ‌క‌వ‌ర్గాల్లో 19 స్థానాలు కాంగ్రెస్ కు ద‌క్కుతాయ‌ని తెలుస్తోంది. పాత మైసూర్ ప్రాంతంలోనూ కాంగ్రెస్ కు 33 స్థానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఇక్క‌డ బీజేపీకి 7.. జేడీఎస్ కు 24 స్థానాలు ల‌భిస్తాయ‌ని చెబుతున్నారు. ఇక్క‌డ బీజేపీకి భారీ న‌ష్టం వాటిల్లుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. ముంబ‌యి క‌ర్ణాట‌క రీజియ‌న్ లో పోటీ పోటాపోటీగా ఉంటుంద‌ని.. కాంగ్రెస్ కు 28 స్థానాలు.. బీజేపీ 22 స్థానాలు ద‌క్క‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. కోస్తాలో కాంగ్రెస్ కు 10 స్థానాలు వ‌చ్చే వీలుంద‌ని.. అదే స‌మ‌యంలో బీజేపీకి 9 స్థానాలు రావొచ్చంటున్నారు. హైద‌రాబాద్ - క‌ర్ణాట‌కలోని 40 స్థానాల్లోనూ కాంగ్రెస్ భారీ అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించే వీలుంద‌ని స‌ర్వే తేల్చింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకి 27 స్థానాల్లో గెలిచే వీలుంద‌ని.. బీజేపీ 10 స్థానాల్లో మాత్ర‌మే గెలుస్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సిద్ద‌రామ‌య్యనే మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నుకునేందుకు 45 శాతం మంది సానుకూలంగా స్పందించ‌టం గ‌మ‌నార్హం.