Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీని వెనక్కు నెట్టేశారు
By: Tupaki Desk | 25 Jan 2018 6:04 PM GMTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో నాలుగో వరసులో సీటు కేటాయించడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తమ నేతను అవమానించేందుకు ఇలా చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే.. రాహుల్ గాంధీ మాత్రం. తనకు ఎక్కడ సీటు కేటాయించారన్నది తాను పట్టించుకోనని - దేశ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడమే తనకు ప్రధానమని అంటున్నారు.
అయితే... కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం గతాన్ని గుర్తు చేస్తున్నారు. రాహుల్ కంటే ముందు అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన తల్లి సోనియాకు కానీ - అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్లో ఉన్నవారికి కానీ ఎన్నడూ ఇలా వెనుక వరుసల్లో సీట్లు కేటాయించిన సందర్భమే లేదట. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడమన్నది ఆనవాయితీగా వస్తోందని చెప్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా రాహుల్ గాంధీకి మాత్రమే ఇలా చేశారని.. బీజేపీ కావాలనే అవమానిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా రాహుల్ కు నాలుగో వరుసలో సీటు కేటాయించడం ఒకెత్తయితే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు మొదటి వరుసలో సీటు కేటాయించడం కాంగ్రెస్ నేతలను మరింత బాధిస్తోందట. ఎంత అధికార పార్టీ అధ్యక్షుడైనా ఆయన్నో తీరుగా, సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఒక తీరుగా ట్రీట్ చేయడం తగదంటున్నారు. మరోవైపు ఈ వేడుకలకు అతిథులుగా హాజరవుతున్న వివిధ దేశాల అధినేతలు కూడా విపక్ష నేతను కలవడం లేదు. అధికారిక షెడ్యూళ్లలో ఈ కార్యక్రమం లేదు. అయితే.. కాంగ్రెస్ పార్టీ - నెహ్రూ కుటుంబంతో అనుబంధం ఉన్న ఇతర దేశాధినేతలు కొందరు మాత్రం భారత్‌కు వస్తున్న సందర్భంగా రాహుల్ - సోనియాలను కలవనున్నట్లు తెలుస్తోంది.