Begin typing your search above and press return to search.

రాజ‌కీయ హీట్ పెంచేస్తున్న ప్ర‌తిప‌క్షం

By:  Tupaki Desk   |   29 March 2017 5:21 AM GMT
రాజ‌కీయ హీట్ పెంచేస్తున్న ప్ర‌తిప‌క్షం
X
మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపిక వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ పదవికి తమ సొంత అభ్యర్థిని బరిలోకి దింపుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. శివసేన ప్రతిపాదిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ అభ్యర్థిత్వాన్ని తాము బలపరచడం లేదని తేల్చిచెప్పింది. అంతర్గతంగా చర్చించిన తర్వాత కచ్చితంగా తమ అభ్యర్థిని రాష్టప్రతి పదవికి పోటీకి పెడతామని ప్ర‌క‌టించింది. కాషాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న తాము భాగవత్‌ ను బలపరిచే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ గగోయ్ తేల్చిచెప్పారు.

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప్రణబ్ ముఖర్జీ వారసుడి ఎంపికలో విపక్షాలు విభేదాలు వీడి ఏకాభిప్రాయంతో ముందుకు వస్తాయా అన్న ప్రశ్నలు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ గగోయ్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చలు జరుపుతుందని జవాబిచ్చారు. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలకు విందు ఇస్తున్నారు. దీని ఉద్దేశం రాష్టప్రతి పదవికి పోటీ చేసే ఎన్‌డిఎ అభ్యర్ధికి మద్దతు సమీకరించాలన్నదేనని అభిజ్ఞ వర్గాల కధనం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/