Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ సీఎం అయితే మ‌రి రేవంత్ ఏంటి?

By:  Tupaki Desk   |   30 July 2018 6:05 PM GMT
ఉత్త‌మ్ సీఎం అయితే మ‌రి రేవంత్ ఏంటి?
X
కాంగ్రెస్ మ‌హా స‌ముద్రంలో ప్ర‌తి ఒక్క‌రూ ఒక ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థే. ఆ పార్టీకి సీనియ‌ర్లే వ‌రమూ - శాప‌మూ. అలాంటి విచిత్ర‌మైన టీంను న‌డిపే బాధ్య‌త రాహుల్ పై ప‌డింది. మ‌రి రాహుల్ మోడీ వంటి గ‌ట్టి పిండాన్ని అనునిత్యం అల్ల‌క‌ల్లోలంగా ఉండే త‌న పార్టీ నేత‌ల అండ‌తో అడ్డుకుంటాడా? లేకపోతే అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను చ‌ల్లార్చ‌డంలోనూ బిజీగా ఉండిపోతాడా అన్న‌ది కాలం డిసైడ్ చేస్తుంది.

ఈరోజు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక ఫీల‌ర్ వ‌దిలారు. ఆయ‌న చిన్న‌వాడూ కాదు - ఆయ‌న వ‌దిలిన ఫీల‌ర్ చిన్న‌దీ కాదు. ఎందుకంటే... రాహుల్ రాజ‌కీయం ఎలా ఉంటుందో ఒక ఎన్నిక కూడా పూర్త‌వ‌లేదు కాబ‌ట్టి ఇంకా ఎవ‌రికీ అవ‌గాహ‌న లేదు. కానీ స‌ర్వే మాత్రం... ఆల్రెడీ పాత సంప్ర‌దాయాల‌ను రాహుల్‌ కు అంట‌గ‌ట్టేస్తున్నాడు. త‌న‌కు క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని రాహుల్ గాంధీ ప‌ర్స‌న‌ల్‌ గా హామీ ఇచ్చార‌ని ఆయ‌న చెప్పేశారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే ముఖ్య‌మంత్రి కూడా ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డే అని తేల్చేశారు. ఇది కూడా రాహుల్ మాటే అని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆల్రెడీ కొంద‌రు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సీఎం పోస్టే టార్గెట్‌ గా ప్ర‌క‌టించి ప‌నిచేస్తున్న రేవంత్ రెడ్డి ప‌రిస్థితి ఏంటి? మ‌రి తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అప‌జ‌యం ఎరుగుని రేవంత్ రెడ్డి ఇపుడు మంత్రి ప‌ద‌వితో స‌ర్దుకోవాల్సిందే... అని ప‌లువురు వ్యంగ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వీటి అర్థం రేవంత్‌ పై సానుభూతి కాదు - ఓయ‌మ్మో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌పుడు చూద్దాం లే అన్న‌ది వారి గూఢార్థం.

ఇదంతా ఒకెత్తు... అస‌లు తెలంగాణ ఇపుడు కాంగ్రెస్ ఆశాదీపం. కేసీఆర్ ఫ్యామిలీ రాజ‌కీయాలు - తెలంగాణ ఇచ్చిన సానుభూతి... త‌న బ‌ద్ధ శ‌త్రువు అయిన తెలుగుదేశంతో పొత్తు వంటి వ్యూహాలు ర‌చిస్తున్నారు రాహుల్ గాంధీ. ప్ర‌స్తుతం కేసీఆర్ కు పైకి కనిపించినంత క్రేజు లేదు... కాంగ్రెస్ ప్రభుత్వాలు మేల‌ని ఎపుడో ప్ర‌జలు నిర్ణ‌యించేసుకున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు. అయితే, కాంగ్రెస్‌ తో పొత్తు టీడీపీకి న‌ష్టం చేసినా... కాంగ్రెస్‌ కు మాత్రం ఒకింత లాభాన్నే చేకూర్చే అవ‌కాశం ఉంది. అయితే... టీడీపీ ఇంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పొత్తుపై స్పందించ‌క‌పోయినా పొత్తు ఉంటుంద‌ని మాత్రం తెలుగుదేశం ప్ర‌ముఖ నేత‌ లోకేష్ గ‌తంలోనే స్ప‌ష్టం చేశారు.