Begin typing your search above and press return to search.

టీకాంగ్రెస్ అధ్యక్ష పదవిపై మల్లగుల్లాలు

By:  Tupaki Desk   |   23 Oct 2019 2:30 PM GMT
టీకాంగ్రెస్ అధ్యక్ష పదవిపై మల్లగుల్లాలు
X
హుజూర్ నగర్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఫలితం కోసం చూస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త అధ్యక్షుడి కోసం చూస్తోంది. ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా సరే పార్టీకి మాత్రం కొత్త అధ్యక్షుడు కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అదేసమయంలో తామే పార్టీ అధ్యక్షుడు కావాలనీ చాలామంది కోరుకుంటున్నారు. పురపాలక ఎన్నికలు రానుండడంతో కొత్త నేత నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే... ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నదే కీలకంగా మారింది.

పార్టీలోని సీనియర్లు, పీసీసీ అధ్యక్ష పీఠం కోసం కాపు కాసుక్కూచున్నవారు మాత్రం బయట నుంచి వచ్చిన నేతలకు చాన్సివ్వరాదని గట్టిగా అంటున్నారు. అందుకు కారణం.. రేవంత్ రెడ్డికి ఎక్కడ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారో అన్న భయమే. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా ఆయన పార్టీలో రోజురోజుకీ పాపులర్ అవుతుండడంతో సీనియర్లంతా ఆందోళన చెందుతున్నారు. వీహెచ్ వంటివారయితే పార్టీకి ఇప్పటికే వార్నింగులు కూడా ఇచ్చారు. రేవంత్‌ను చీఫ్ చేస్తే తాను పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతానని ఆయన గతంలో హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీకి జవసత్వాలు, ఊపు అందించాలంటే అది రేవంత్ వల్లే సాధయమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పదవి నుంచి వైదొలగాలని అనుకోవడం లేదు. తానుండగా కొత్త అధ్యక్షుడి మాటెందుకు వస్తోందంటూ ఆయన విసుక్కుంటున్నారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ గెలిస్తే ఆయన మరి కొన్నాల్ల పాటు పదవిలో ఉండొచ్చు కూడా. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మార్పు తప్పకపోవచ్చు.