Begin typing your search above and press return to search.

ఏపీలో ఏకగ్రీవాల జాతర.. ఏ జిల్లాలో ఎన్నంటే?

By:  Tupaki Desk   |   4 Feb 2021 4:06 PM GMT
ఏపీలో ఏకగ్రీవాల జాతర.. ఏ జిల్లాలో ఎన్నంటే?
X
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ ఏపీ సీఎం జగన్ మధ్య ఇప్పుడు 'పంచాయితీ' నడుస్తోంది. నిమ్మగడ్డ ఎత్తులకు జగన్ పైఎత్తులు వేస్తూ పంచాయితీ పోరును పీక్ స్టేజికి తీసుకెళుతున్నాడు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ధీటుగా సీఎం జగన్ 'ఏకగ్రీవాల' అస్త్రం తీశారు. నిమ్మగడ్డ పట్టుబట్టి నిర్వహిస్తున్న పంచాయితీ ఎన్నికల్లో అసలు ఎన్నికలే జరగకుండా పంచాయితీలకు భారీ నజరానాను జగన్ ప్రకటించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో 'ఏకగ్రీవాల జాతర' నడుస్తోంది.

ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. అయితే అప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న ఈ నజరానాల గురించి పంచాయతీల్లో ముందుగానే అవగాహన ఉండడం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలతో చాలా చోట్ల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట అభ్యర్థలు నామినేషన్లకే మొగ్గు చూపారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయినట్లు.. ఎస్ఈసీ విడుదల చేసిన గణంకాలు చెబుతున్నాయి.

ఆయా జిల్లాల్లో ఏకగ్రీవాలు చూస్తే.. శ్రీకాకుళంలో 321 పంచాయితీలకు 39 ఏకగ్రీవమయ్యాయి. ఇక విశాఖలో 38, తూర్పు గోదావరిలో 38, పశ్చిమ గోదావరిలో 40, కృష్ణా జిల్లాలో 20, గుంటూరులో 67, ప్రకాశంలో 28, నెల్లూరులో 14, చిత్తూరులో 96, కర్నూలులో 54, కడపలో 46, అనంతపురంలో 6 పంచాయితీలు ఏకగ్రీమైనట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.