Begin typing your search above and press return to search.

సీఎం సంచ‌ల‌నం:న‌న్ను లేపేసేందుకు భారీ కుట్ర

By:  Tupaki Desk   |   12 May 2018 7:20 AM GMT
సీఎం సంచ‌ల‌నం:న‌న్ను లేపేసేందుకు భారీ కుట్ర
X
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఫైర్ బ్రాండ్‌ నాయ‌కురాలిగా పేరున్న దీదీ త‌న‌పై కుట్ర జరుగుతోందంటూ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. జాతీయ రాజకీయాల్లో మమత ఇటీవల కీలక పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. జీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తొలుత తనను వ్యక్తిగతంగా దెబ్బతీసి...తరవాత భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ రాజకీయ పార్టీ కుట్ర చేసిందని ఆమె అన్నారు. అయితే ఇంత‌కుమించిన వివ‌రాలు ఆమె వెల్ల‌డించలేదు.

త‌న హ‌త్య విష‌యంలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఖ‌చ్చిత‌మైన స‌మాచారం వ‌చ్చింద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ వివ‌రించారు. 'ఓ రాజకీయ పార్టీ నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. తొలుత వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం... ఆ తర్వాత భౌతికంగా తొలగించుకోవడం ఆ కుట్ర వ్యూహం' అని మమతా అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ సుపారీ మాట్లాడి, అడ్వాన్స్ కూడా ఇచ్చిందని ఆమె కిరాయి హంతకులు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని మమతా వెల్లడించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తననూ, తృణమూల్ కాంగ్రెస్ ను ఎవరూ ఏం చేయలేరని మమతా బెనర్జీ పేర్కొన్నారు.అయితే ఆమె ఆ రాజకీయ పార్టీ పేరు మాత్రం వెల్లడించలేదు. కాగా, త‌న ప్రాణాల‌కు ముప్పున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ బంగ్లాలోకి మారాల్సిందిగా పోలీసులు సూచించార‌ని ఆమె వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి కాక‌ముందు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆమె ఓ చిన్న ఇంట్లోనే ఉంటున్నారు.

ఇదిలాఉండ‌గా..గ‌తంలో ఒక‌సారి మ‌మ‌త‌పై దాడి జ‌రిగింది. సీపీఎంకు చెందిన లాలూ అలాం అనే ఓ కార్య‌క‌ర్త ఆమెపై దాడి చేయ‌గా త‌ల‌కు గాయం త‌గిలింది. దీంతో ఆమెకు చికిత్స చేశారు.కాగా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన కార్య‌క‌ర్త‌ను సీపీఎం పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. ఇటీవ‌లి కాలంలో జాతీయ‌ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌మ‌తా ఈ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.