Begin typing your search above and press return to search.

నాపై దాడికి కుట్ర.. ప్రచారంలో ఈటెల షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:00 PM IST
నాపై దాడికి కుట్ర.. ప్రచారంలో ఈటెల షాకింగ్ కామెంట్స్
X
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమరానికి సమయం ఫిక్స్ అవ్వడంతో రాజకీయ రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ ఎస్ అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో నేతల తాజా కామెంట్స్ , మరింత హీట్ పెంచాయి. తాజాగా నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలం నర్సింహులపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు.

ఈనెల 13, 14 తేదీలలో నామీద నేనే దాడి చేయించుకుంటా అని మంత్రులు అంటున్నారు. నా మీద దాడికి ఏమైనా కుట్ర చేస్తున్నారేమో అని తీవ్ర ఆరోపణలు చేశారు. నామీద ఒక మంత్రిగారు మాట్లాడుతున్నారు. నేను చేతకాక, ముఖం చెల్లక ఓడిపోతాను అనే భయంతో.. నా కార్యకర్తలతో నేనే ఈ నెల 13, 14 తేదీలలో దాడి చేయించుకొని.. కాళ్లు, చేతులకు కట్లు కట్టుకుని, నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఓట్లు అడుగుతారు అని మాట్లాడుతున్నారు. ఇదే చెన్నూరు ఎమ్మెల్యే కూడా కమలాపూర్‌లో మాట్లాడారు. కన్నీళ్లు పెట్టడం ఈటల రాజేందర్‌కి రాదు. అలాంటి పనికిమాలిన పనులు ఈటల చేయడు. నా మీద దాడి చేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి.

మాజీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్‌మెన్లు ఉంటారు. నేను మాజీ మంత్రిని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు మాత్రం ఒక్కడే గన్‌మెన్ ఉంటాడు. అయినా బయటికి పోవడానికి భయపడే వాడిని కాదు అని ఈటల సంచలన కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ అబద్ధాల మాటలు పక్కనపెట్టి దళితులకు పది లక్షలు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తాను లేఖ రాశానని దొంగ లేఖలు సృష్టించి.. దళితులకు పది లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు పది లక్షలు ఇచ్చినట్లుగానే.. ఇతర పేదలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. ఓటుకి 20 వేలు ఇస్తారట తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకు వేయండి. చెయ్యి ఎత్తగానే ఎర్ర బస్సు ఎలా ఆగుతుందో.. నేను కూడా చెయ్యి ఎత్తగానే ఆగి పనిచేసే వాడి అంటూ ప్రజలకు ఈటెల విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుర్చీ కోసం ఎసరు పెట్టానంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నానరని, తమను బానిసల్లా కాకుండా మనుషుల్లా చూడాలని చెప్పినందుకే తమనూ కక్షగట్టి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణక, హుజురాబాద్‌ కా, అర్థం కావడం లేదని, ఐదు నెలలుగా హుజూరాబాద్‌ని తప్ప ఇంకేమీ పట్టించుకోవటం లేదని ఈటల ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘నా పేరుతో తప్పుడు ఉత్తరాలు సృష్టించటం కాదు.. మొగోడివైతే నిజాయతీగా ఎన్నికలో కొట్లాడు అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.