Begin typing your search above and press return to search.

సేవ్ ఏపీ పోలీస్..! వామ్మో ! ఏంటి ? ఇది నిజ‌మా !

By:  Tupaki Desk   |   15 Jun 2022 3:29 PM GMT
సేవ్ ఏపీ పోలీస్..! వామ్మో ! ఏంటి ? ఇది నిజ‌మా !
X
ఆంధ్రావ‌ని వాకిట కొత్త నినాదం ఇవాళ వినిపించింది. సేవ్ ఏపీ పోలీస్ అనే నినాదాన్ని వినిపిస్తూ అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఒక‌రు ప్ల‌కార్డు చేబూని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జిల్లా పోలీసు కార్యాల‌య ప్రాంగ‌ణాన ఉన్న అమ‌రుల స్థూపం వ‌ద్ద ఆయ‌న నిర‌స‌న తెలియ‌జేసి సంచ‌ల‌నం రేపారు. ప్ర‌కాశ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ త‌న‌దైన శైలిలో నిర‌స‌న తెలిపి త‌మకు రావాల్సిన స‌రెండర్ లీవ్ బ‌కాయిలు వెంట‌నే చెల్లించాల‌ని కోరారు.

అదేవిధంగా త‌మ‌కు రావాల్సిన ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను సైతం వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఇప్ప‌టిదాకా 3 స‌రెండ‌ర్ లీవులు, అద‌న‌పు స‌రెండ‌ర్ లీవుల‌కు సంబంధించి డ‌బ్బులు చెల్లించ‌లేద‌ని, అదేవిధంగా హెల్త్ ఎల‌వెన్సులు కూడా చెల్లించ‌లేద‌ని ఆవేద‌న చెందుతూ ఉన్నారు.

అదేవిధంగా 6 డియ‌ర్‌మెస్ ఎల‌వెన్స్ (dearness allowance) (క‌రువు భ‌త్యాలు), 14 నెల‌ల ట్రావెలింగ్ ఎలవెన్స్-లు కూడా బ‌కాయి ఉన్నార‌ని చెబుతున్నారీయ‌న. వీటిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. స‌రెండ‌ర్ లీవ్ బ‌కాయిలతో స‌హా ఇత‌ర జీతం బ‌కాయిలు చెల్లించ‌క‌పోగా, చెల్లించిన‌ట్లు చూపించి వాటిపై ట్యాక్స్ కూడా వ‌సూలు చేశార‌ని ఆవేద‌న చెందుతూ ఇవాళ ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేయడంతో అంతటా ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

వాస్త‌వానికి జీతం బ‌కాయిల చెల్లింపుల్లో ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో తాత్సారం చేస్తూవ‌స్తోంద‌ని పోలీసులు చెబుతున్నారు. నిరంతరం డ్యూటీలలో ఉండే త‌మ‌కు ఏడాదికి 45 స‌రెండ‌ర్ లీవులు ఉంటాయి. మిగ‌తా ఉద్యోగుల‌కు 15 రోజులు స‌రెండ‌ర్ లీవులు ఉంటే, త‌మ‌కు మాత్రం ఈ విధంగా ఉద్యోగ విధులలో భాగంగా సెల‌వులు లేని కార‌ణంగా వేత‌నంతో కూడిన జీతం చెల్లింపు ఉంటుంద‌ని, స‌రెండ‌ర్ లీవ్ చెల్లింపుల‌లో భాగంగా ఆఫ్ సేల‌రీ పే చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో మూడు సార్లు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అని కానీ ఇప్ప‌టిదాకా అటువంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌లేద‌ని పోలీసులు ఆవేద‌న చెందుతున్నారు.

పని ఒత్తిడి మాత్రం రోజురోజుకూ పెంచుతూ క‌నీసం కానిస్టేబుల్ , హోం గార్డ్ రిక్రూట్మెంట్-కు కూడా చొర‌వ చూపేందుకు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇష్టప‌డ‌డం లేద‌ని వీరంతా వాపోతున్నారు. వారాంత‌పు సెల‌వులు ఇవ్వాల్సి ఉన్నా, సిబ్బంది కొర‌త కార‌ణంగా ఎస్సైలు, ఏఎస్సైలు కూడా ఇందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని దిగువ స్థాయి సిబ్బంది కన్నీటిప‌ర్యంతం అవుతున్నారు.

ఆరోగ్య రీత్యా బాగుండ‌క పోయినా విధుల్లోకి రావాల్సిందే అన్న ఒత్తిడి పెరిగిపోతుంద‌ని వీరంతా చెబుతున్నారు. ఇప్ప‌టికైనా త‌మ న్యాయప‌ర‌మైన డిమాండ్లకు స‌త్వ‌ర ప‌రిష్కారం చూపించాల‌ని వీరంతా వేడుకుంటున్నారు.