Begin typing your search above and press return to search.

మన కానిస్టేబుల్ శ్రీనివాసులు మొనగాడు భయ్

By:  Tupaki Desk   |   16 Aug 2016 4:46 AM GMT
మన కానిస్టేబుల్ శ్రీనివాసులు మొనగాడు భయ్
X
ప్రాంతాల్ని పక్కన పెడితే నిజంగా ఇది తెలుగు ప్రజలంతా సంతోషపడాల్సిన సందర్భమిది. జాతీయ స్థాయిలో ఒక తెలుగు వ్యక్తికి అభించిన అపురూపమైన పురస్కారం గురించి మీడియాలో పెద్ద గుర్తింపు లభించలేదు. సాధారణంగా భద్రతా దళాల సిబ్బందికి ప్రకటించే శౌర్యచక్ర పతకం ఒక తెలుగు కానిస్టేబుల్ కు లభించటం మామూలు విషయం కాదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ అరుదైన గౌరవాన్ని ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకునేది.

ఎందుకింత ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఇలాంటి గౌరవం మరెవరికీ దక్కలేదు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కానిస్టేబుల్ శ్రీనివాసులకు ఈ అపూర్వ గౌరవం లభించింది. గత ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆలం జేబ్ అఫ్రిదీని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాసుల మీద కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు వెనక్కి తగ్గకుండా ఆలంను అదుపులోకి తీసుకోవటంలో కీలకపాత్ర పోషించాడు.

ఆలంను అదుపులోకి తీసుకోవటంలో కత్తిదాడితో ఏర్పడిన గాయాన్ని సైతం లెక్క చేయకుండా.. పట్టుకోవటంలో ప్రదర్శించిన సాహసం ఆయనకు శౌర్యచక్ర పతకం లభించేలా చేసింది. దేశ వ్యాప్తంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 14 మందికి శౌర్యచక్ర ప్రకటిస్తే.. ఆ జాబితాలో కానిస్టేబుల్ శ్రీనివాసులుకు ఈ అరుదైన గౌరవం లభించింది. ఏమైనా.. మన కానిస్టేబుల్ శ్రీనివాసులు మొనగాడే కదూ.