Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీలో త‌గ్గ‌ని హీట్.. ఢీ అంటే ఢీ!

By:  Tupaki Desk   |   29 Aug 2022 5:40 AM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీలో త‌గ్గ‌ని హీట్.. ఢీ అంటే ఢీ!
X
గుంటూరు జిల్లాలో రాజ‌ధాని అమ‌రావతి ప్రాంతం నెల‌కొని ఉన్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీకి త‌ల‌పోటు తెస్తోంద‌ని అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప్రముఖ వైద్యురాలు ఉండ‌వ‌ల్లి శ్రీదేవి గెలుపొందారు. ప్ర‌స్తుతం ఆమె వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా కూడా ఉన్నారు. అయితే గెలిచిన ద‌గ్గ‌ర నుంచి శ్రీదేవికి నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌ల పార్టీ నాయ‌కుల‌తోనే విభేదాలు ఏర్ప‌డ్డాయి. ఏకంగా ఒక మండ‌ల పార్టీ నేత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తానని.. ఎమ్మెల్యే శ్రీదేవి వేధిస్తోంద‌ని ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల తాడికొండకు అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా డొక్కా మాణిక్య‌వ‌ర‌ ప్ర‌సాద్‌ను వైఎస్సార్సీపీ అధిష్టానం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అటు డొక్కా, ఇటు శ్రీదేవి ఇద్ద‌రూ మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. గ‌తంలో అంటే 2004, 2009లో డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ తాడికొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలుపొందారు. అంతేకాకుండా మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత 2014లో ఆయ‌న టీడీపీలో చేరారు. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

అయితే టీడీపీకి రాజీనామా చేసి రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా చాన్స్ కొట్టేశారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ప్ర‌భుత్వ విప్‌గానూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను తాడికొండ అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా నియ‌మించ‌డాన్ని శ్రీదేవి వ‌ర్గీయులు హ‌ర్షించ‌లేక‌పోతున్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన డొక్కాకు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఎలా ఇస్తారని నిల‌దీస్తున్నారు. ద‌ళితుల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు ఇన్‌చార్జిని నియ‌మించ‌డం ద్వారా వైఎస్సార్సీపీ ద‌ళితుల‌కు ఏం సందేశం ఇస్తోంద‌ని శ్రీదేవి నిల‌దీస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో చేయ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయా మండ‌లాల్లో కొంత‌మంది శ్రీదేవికి మ‌ద్ద‌తుగా, మ‌రికొంత‌మంది డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌కు మ‌ద్దతుగా ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మేడికొండూరు, తాడికొండ, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యులు డొక్కాకు మద్దతు తెలుపుతున్నారు. అదే విధంగా మేడికొండూరు ఎంపీపీ, పార్టీ ఎస్సీ, మైనార్టీ సెల్ నేతలు శ్రీదేవికి మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్‌కు వివాద‌ర‌హితుడిగా పేరుంది. మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబశివ‌రావు అనుచ‌రుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. టీడీపీ నేత‌ల‌తోనూ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి డొక్కాను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా దించాల‌ని యోచిస్తోంది. డొక్కా అభ్య‌ర్థి అయితే అమ‌రావ‌తి ప్రాంతం నెల‌కొన్న తాడికొండ‌లో వ్య‌తిరేక‌త నుంచి బ‌య‌ట‌ప‌డి విజ‌యం సాధించడానికి అవ‌కాశాలుంటాయ‌ని ఆ పార్టీ లెక్క‌లేసుకుంటోంది.

అయితే శ్రీదేవి, డొక్కా వివాదాల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత‌లు పోటాపోటీగా ర్యాలీలు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా త‌మపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న‌వారిని శ్రీదేవి, డొక్కా ఇద్ద‌రూ పోలీసుల‌తో అరెస్టు చేయిస్తుండ‌టం వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. మ‌రోవైపు పోలీసులు ఎవ‌రి మాటో వినాలో తెలియ‌క జుట్టు పీక్కుంటున్నార‌ని అంటున్నారు.

తాజాగా.. ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతుగా మేడికొండూరులో సమావేశం చేపట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేశార‌ని చెబుతున్నారు. దీని ద్వారా శ్రీదేవికి మద్దతుగా నిలిచిన వారిలో ఆందోళన నెల‌కొంద‌ని అంటున్నారు. మ‌రోవైపు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, ఎమ్మెల్యే శ్రీదేవికి విభేదాలు లేవన్నారు. శ్రీదేవి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపారు. పార్టీ ఏద‌యితే త‌న‌కు ప‌ని అప్ప‌గించిందో.. అదే ప‌ని తాను చేస్తున్నాన‌ని డొక్కా తెలిపారు. త‌న‌కు తానుగా నియోజ‌క‌వ‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.