Begin typing your search above and press return to search.

షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుంది: పీపీఏ

By:  Tupaki Desk   |   20 Dec 2020 2:30 PM GMT
షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుంది: పీపీఏ
X
పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తి చేసుకోబోతుండడం విశేషంగా మారింది. ప్రస్తుతం పనులు కీలక దశకు చేరుకున్నాయి.

కరోనా లాక్ డౌన్ లోనూ పనులు ఆపకుండా ఏపీ సర్కార్ పనులు కొనసాగించింది. మొన్నటి వర్షాలకు వరదలు వచ్చినా ముందస్తుగానే గడ్డర్లు ఏర్పాటు చేసుకొని పనులు ఆగకుండా చేశారు.

తాజాగా పోలవరంలో వేగంగా జరుగుతున్న పనుల పై పోలవరం ప్రాజెక్ట్ ఆథార్టీ (పీపీఏ) పరిశీలించింది. సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం పరిశీలించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్ వే బ్రిడ్జి,గేట్ల ఏర్పాటు,ఎగువ కాపర్ డ్యాం పనులను,ఫిష్ లాడర్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇంజనీర్లు పీపీఏ బృందానికి వివరించారు. ఈ బృందం 2 రోజులు అక్కడే పర్యటించి వివిధ అంశాలపై పరిశీలించనున్నారు.

పోలవరం పనుల్లో తాజాగా ఏర్పాటు చేసిన ఆర్మ్ గర్డర్స్ పరిశీలించిన చంద్రశేఖర్ అయ్యర్ బృందం పనులు కొనసాగుతున్న తీరును ప్రశంసించారు. రేపు సాయంత్రానికి పోలవరం ప్రాజెక్ట్ లో తొలి గేట్ అమరుస్తున్నామని అయ్యర్ కి తెలిపిన పోలవరం ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ నిపుణులు పనులను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.

పోలవరం పనులు పరిశీలించిన అనంతరం పీపీఏ సిఈఓ చంద్ర శేఖర అయ్యర్ మీడియా తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం డిసెంబర్ 2021 వరకు పూర్తి అవుతుందని తెలిపారు.