Begin typing your search above and press return to search.

బోత్స నీకు ఓట్లు వేసి గెలిపించింది దీనికోసమేనా..?

By:  Tupaki Desk   |   26 Oct 2019 10:01 AM GMT
బోత్స నీకు ఓట్లు వేసి గెలిపించింది దీనికోసమేనా..?
X
ఏపీలో ఇసుక సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇసుక పై ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇసుక సమస్యలో ఎటువంటి మార్పు రాలేదు. దీనిపై కార్మికులు భగ్గుమంటున్నారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కార్మికుల నిరసనలు మంత్రులకి ఇబ్బందికరంగా మారింది. తాజాగా గుంటూరు లో ఈరోజు పర్యటించిన మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.

గత కొన్నాళ్లుగా ఏపీలో ఇసుక అందుబాటులో లేక పనులు నిలిచిపోవడంతో కార్మికులు పనులు లేక విలవిలలాడిపోతున్నారు. ఈ సమయంలో నగరానికి వచ్చిన బొత్సను అడ్డుకుని ఇసుక విషయంలో నిలదీశారు. ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని - మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా అంటూ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనితో కార్మికులను సముదాయించి - ఇసుక సమస్య త్వరలోనే తీరిపోతుంది అని బొత్స చెప్పారు. ఆ తరువాత నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు - కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని - తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.మరోవైపు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. రోజురోజుకి ఇసుక కొరత తీవ్రతరం కావడం కార్మికుల ఎక్కడిక్కడ రోడ్డెక్కి మంత్రులను అడ్డగించి తమ నిరసనని తెలియజేస్తున్నారు.