Begin typing your search above and press return to search.

ఉప ఫలితం దెబ్బకు పరామర్శా కేటీఆర్?

By:  Tupaki Desk   |   3 Nov 2021 9:53 AM GMT
ఉప ఫలితం దెబ్బకు పరామర్శా కేటీఆర్?
X
గెలుపు ఎంత తియ్యగా ఉంటుందో.. ఓటమి అంతకు రెట్టింపు చేదుగా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట.. ఓటమి నుంచి బయటకు రావటం అంత తేలికైన విషయం కాదు. అందునా చేతిలో అధికారం.. అంతకు మించి అన్న రీతిలో ఉన్న టీఆర్ఎస్ అధినాయకత్వానికి తాజాగా ఈటల గెలుపు జీర్ణించుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి వేళ.. అనూహ్యమైన అంశాన్ని తీసుకొని బయటకు వచ్చిన మంత్రి కేటీఆర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి. తాజాగా సిరిసిల్లకు చెందిన ఆరేళ్ల పాప మీద టీఆర్ఎస్ కు చెందిన స్థానిక నేత ఒకరు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే. బాధితురాలిని హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అక్టోబరు 27న ఆరేళ్ల పాపపై జరిగిన అత్యాచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాపకు వైద్యం చేయటానికి స్థానిక ఆసుపత్రి సిబ్బంది నిరాకరించటం.. దీనిపై విమర్శలు రావటంతో హైదరాబాద్ తరలించటం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన కాసేపటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి.. బాధిత పాపను పరామర్శించారు. ఈ సందర్భంగా పొత్తి కడుపు దగ్గర నొప్పి వస్తుందని చెప్పటంతో.. మెరుగైన వైద్యం చేయాలని వైద్యుల్ని కోరారు.

చిన్నారి పాప బంగారు భవిష్యత్తును నాశనం చేశారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన చిన్నారికి జరిగిన దారుణం గురించి తెలిసిన మంత్రి కేటీఆర్ తాజాగా నీలోఫర్ కు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పరామర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ దూరంగా ఉంటారన్న వాదనకు భిన్నంగా.. ఉప ఎన్నిక ఓటమిని అధిగమించి మరీ.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నానానికి నీలోఫర్ కు వెళ్లి పరామర్శించిన వైనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బండి సంజయ్ ఆసుపత్రికి వెళ్లటం.. ఈ ఉదంతం అంతకంతకూ పెద్దది అవుతున్న వేళలో.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పరామర్శకు వెళ్లటం ద్వారా హుజూరాబాద్ ఫలితాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావన కలిగేలా మంత్రి కేటీఆర్ తీరు ఉందంటున్నారు. ఏమైనా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ అధినాయకత్వం మైండ్ సెట్ ను మారుస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఆరేళ్ల బాలికకు పరామర్శ కంటే కూడా.. ఆరోపణలు ఉన్న సొంత పార్టీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా మంత్రి కేటీఆర్ పైన ఉందని చెప్పక తప్పదు.