Begin typing your search above and press return to search.

చెన్నై షాపింగ్ మాల్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయ.. ఫైన్

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:14 AM GMT
చెన్నై షాపింగ్ మాల్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయ.. ఫైన్
X
ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను మురిపించే వాణిజ్య సంస్థలకు తమ మాటలకు భిన్నంగా వ్యవహరిస్తే.. అలాంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు వినియోగదారుల కోర్టులు సిద్ధంగా ఉంటాయన్న విషయాన్ని తెలిపే ఉదంతమిది. తాజాగా సికింద్రాబాద్ లోని చెన్నై షాపింగ్ మాల్ కు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ -3 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాచారం భవానీ నగర్ కు చెందిన శ్రీకాంత్ ఫోన్ కు 2019 అక్టోబరు 19న చెన్నై షాపింగ్ మాల్ నుంచి రాయితీకి సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే బిల్లులో 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో అదే నెల 27న షాపింగ్ మాల్ కు వెళ్లిన ఆయన వస్త్రాల్ని కొనుగోలు చేశారు. కొంత మేర ఆభరణాలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన చెల్లింపును ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపారు.

అలా చెల్లించిన రూ.ఆరు వేలకు పైగా మొత్తానికి ఐదు శాతం రాయితీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. దీనిపై సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవటంతో.. వినియోగదారుల ఫోరంను సంప్రదించారు శ్రీకాంత్.

ఈ ఉదంతంపై విచారణ జరిపిన కమిషన్ సాక్ష్యాలను పరిశీలించారు. వినియోగదారుడి వాదనల్ని ఏకీభవిస్తూ శ్రీకాంత్ నుంచి అదనంగా వసూలు చేసిన రూ.306 మొత్తాన్ని తిరిగి ఇవ్వటంతో పాటు పరిహారం కింద రూ.10వేలు..

కేసు ఖర్చుల కింద రూ.5వేలు ఇవ్వాలని చెన్నై షాపింగ్ మాల్ ను ఆదేశించారు. సో.. ఇలాంటి రాయితీ సందేశాల్ని పంపి.. తిరిగి చెల్లింపులు జరపకుంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే న్యాయంజరగటంతో పాటు.. సదరు సంస్థలకు షాకిచ్చే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.