Begin typing your search above and press return to search.

5జీ సాంకేతికత వైపు వినియోగదారుల అడుగులు.. టాప్ లో వివో!

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:30 PM GMT
5జీ సాంకేతికత వైపు వినియోగదారుల అడుగులు.. టాప్ లో వివో!
X
సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు అంచలంచెలుగా వృద్ధి చెందాము. మొదటిగా 2జీ, 3జీ, 4జీ, ఎప్పుడు 5జీ. ఇలా ఒక్కొక్క తరాన్ని దాటుకుంటూ వచ్చాము. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్ లకు ఒక రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది. ఈ త్రైమాసికంలో మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే సుమారు 22 శాతం వృద్ధిని నమోదు చేశాయని కన్సల్టెన్సీ సంస్థ అయిన సైబర్ మీడియా రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది.

వినియోగదారుల ఆసక్తి, అభిరుచికి తగ్గట్టుగానే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ సాంకేతికతతో కూడిన ఫోన్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకు వస్తున్నాయి అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ శ్రేణిలోనూ వినియోగదారుని బడ్జెట్ లోనే వీటిని తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైంది. వివో, శాంసంగ్, ఒప్పో , రియల్ మీ, వన్ ప్లస్ లాంటి సంస్థలు కస్టమర్ దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 5జీ స్మార్ట్ ఫోన్ లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమైంది. తక్కువ మొత్తంలోనే 5జీ సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడంతో వినియోగదారులు కూడా ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగానే 2021 మూడో త్రైమాసికంలో కేవలం 5జీ స్మార్ట్ ఫోన్లు చేసిన మార్కెట్ మూడు బిలియన్ డాలర్లలకు పైగా ఉందని సైబర్ మీడియో రీసర్చ్ తెలిపింది.

ఐదోతరం సాంకేతికతకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో అగ్రస్థానంలో వివో కొనసాగుతోందని ఈ సర్వేలో తేలింది. సుమారు 18 శాతం మార్కెట్ ను వివో సొంతం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ తర్వాతి స్థానంలో శాంసంగ్ కొనసాగినట్లు తెలిపింది. ఈ సంస్థ మార్కెట్లో 16 శాతం మేర 5జీ సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్లు స్పష్టమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు సుమారు 5 నుంచి 8 శాతం వరకు పెరిగాయని సర్వేలో తేలింది.
ప్రత్యేకించి డిజిటల్ యుగం వైపు వినియోగదారులు అడుగులు వేయడంతో వీటికి అధిక డిమాండ్ ఏర్పడినట్లు సర్వే సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా విడిభాగాలు తయారీ, సరఫరా తో కూడిన సమస్యలు వచ్చే త్రైమాసికంలో కూడా ఎదురుకానున్నట్లు సైబర్ మీడియా రీసెర్చ్ పేర్కొంది.

ఈ త్రైమాసికంలో వన్ ప్లస్ సంస్థ విక్రయాలు 68 శాతం పెరిగాయి. మరోవైపు ప్రీమియం ఫోన్ల తయారీ సంస్థ అయిన ఆపిల్ విక్రయాలు కూడా 32 శాతానికి పైగా వృద్ధి చెందినట్లు సైబర్ మీడియా రీసర్చ్ తెలిపింది.