Begin typing your search above and press return to search.

పెట్రోలు వినియోగం ఢమాల్​..! కారణం ఏమిటంటే?

By:  Tupaki Desk   |   11 April 2021 8:30 AM GMT
పెట్రోలు వినియోగం ఢమాల్​..! కారణం ఏమిటంటే?
X
దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్​ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కరోనా యేనని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఏనాడు కూడా ఇటువంటి క్షీణత నమోదు కాలేదు.

గత ఏడాది ఎన్నడూ లేని విధంగా 9.1 శాతం పెట్రో ఉత్పత్తుల వినియోగం క్షీణించింది. 1998-99 సంవత్సరంలో ఈ స్థాయిలో పెట్రో ఉత్పత్తుల వినియోగం పడిపోయింది. ఆ తర్వాత ఇదేనని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2019-20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 194.63 మిలియన్ టన్నులకు తగ్గిపోయింది. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) ఓ డాటాను విడుదల చేసింది.

అయితే చమురు వినియోగం తగ్గినప్పటికీ ఎల్​పీజీ గ్యాస్​ వినియోగం పెరిగిందని ఆర్థికవేత్తలు అంటున్నారు. డీజిల్ వినియోగం 12 శాతం పడిపోయింది. 72.72 మిలియ‌న్ ట‌న్నుల‌కు, పెట్రోల్ వినియోగం 6.7 శాతం త‌గ్గి 27.95 మిలియ‌న్ ట‌న్నుల‌కు ప‌రిమిత‌మైంది. వంట గ్యాస్ మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం నుండి 25.59 శాతానికి పెరిగింది.

కరోనా ఎఫెక్ట్​ తో చాలా కాలంపాటు విమాన ప్రయాణాలు సాగలేదు. పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గిపోవడానికి ఇది కూడా ఓ కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు. అంతేకాక.. లాక్​డౌన్​ ఎఫెక్ట్​ తో చాలా మంది వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో వాహనాలు బయటకు తీయలేదు. ఇది కూడా పెట్రో ఉత్పత్తులు తగ్గడానికి కారణమని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.