Begin typing your search above and press return to search.

తెలంగాణలో జనసేన పోటీ.. హాట్ టాపిక్.. మనకు అవసరమా సామి?

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:30 AM GMT
తెలంగాణలో జనసేన పోటీ.. హాట్ టాపిక్.. మనకు అవసరమా సామి?
X
మిగిలిన రంగాలకు భిన్నం రాజకీయం. ప్రజల మద్దతు.. అభిమానం ఒక్కటే రాజకీయాల్లో రాణించటానికి.. అధికారంలోకి రావటానికి సరిపోదు. దానికి మరిన్ని అంశాలు అవసరం. చిన్నపాటి తప్పులు కూడా అధికారాన్నిచేజారేలా చేస్తుంటాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో ఉదంతాల్లో చూసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని మాట ఇచ్చానన్న ఒకే ఒక్క కారణంతో సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న అంచనా..తెలంగాణను ఇచ్చిన కారణంగా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయం. అదే సమయంలో ఏపీలో అధికారం చేజారినా.. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి తమ చేతుల్లోనే ఉంటుందని భావించారు. దేశాన్ని రిమోట్ కంట్రోల్ చేసిన నడిపిన సోనియా లాంటి పెద్ద మనిషి.. తెలంగాణ ఇచ్చిన తమకంటే కూడా తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ వెంట ప్రజలు ఉంటారన్న చిన్న లాజిక్ ను మిస్ కావటం.. ఇప్పుడా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇట్టే అర్థమవుతుంది.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు చాలా చాలా వేగంగా పరిణామాలు మారిపోయేలా చేస్తుంటాయని చెప్పటానికే. ఏపీలో అధికారంలోకి రావటమే లక్ష్యమన్నట్లుగా పవన్ కల్యాణ్ జనసేనను ఏర్పాటు చేసిన మాట నిజం. అయితే.. తమకు అధికారం అక్కర్లేదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినా అంతిమ లక్ష్యం పవర్ చుట్టూనే అన్న విషయం తెలిసిందే. పవర్ మీద ఆసక్తి లేకపోతే స్వచ్ఛంద సంస్థను కూడా పెట్టుకోవచ్చు. ఇవాల్టి రోజున అధికారం చేతిలో లేని పార్టీని ఎవరూ చూడటం లేదన్న కఠిన వాస్తవాన్ని మర్చిపోకూడదు.

ఏపీలో జనసేన పరిస్థితి గురించి తెలిసిందే. సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ. అదే సమయంలో ఎవరి అధికారాన్ని అయినా దూరం చేసే సత్తా ఎక్కువ. అదే జనసేన ప్రత్యేకత. ఆ పార్టీ ఎవరితోనైనా కలిస్తే.. వేరే పార్టీకి దెబ్బ. అలా అని.. నా దారి నేను చూసుకుంటానంటే ఆ పార్టీకి లాభం చేకూరదు. ఆ పార్టీ మాదిరే పోరాడే మరో పార్టీకి అధికారం సొంతం కాదు. ఏపీకి చెందిన పార్టీగా ముద్రపడిన జనసేన పరిస్థితి అలా ఉంటే.. తెలంగాణలో మరెలాంటి పరిస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికి ఏపీలో పూర్తి స్తాయిలో ఫోకస్ చేయలేకపోతున్నారు పవన్ కల్యాణ్. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలమే మిగిలిన వేళ.. ఏపీ మొత్తాన్ని సుడిగాలి పర్యటన చేపట్టాలని భావిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లు చేయగలుగుతారా? అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పార్టీని విస్తరిస్తూ.. తెలంగాణలో పార్టీ ఉనికి కోసం పోరాడటం సాధ్యమా? అన్నది మరో సందేహం. ఎందుకంటే.. ఏపీలో బలమైన నేతలు లేకున్నా.. పార్టీకి అభిమానులు పెద్ద అండగా ఉన్నారు. కనీస ఓటు బ్యాంకు ఉంది.

కానీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. మరోవైపు తెలంగాణలో ఆయన తీరు ఇప్పటికి అస్పష్టం. ఆయన కేసీఆర్ కు అనుకూలమా? ప్రతికూలమా? ఆయనకు మద్దతు ఇస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అన్న దానిపై స్పష్టత లేదు. అదే సమయంలో తెలంగాణ అధికారపక్షంపై పోరాడుతున్న కాంగ్రెస్ తో కానీ బీజేపీతో కానీ చెట్టాపట్టాలు వేసుకున్నది లేదు. ఏపీలో బీజేపీతో జనసేన ఉమ్మడి పోరు అని చెబుతున్న వేళ.. తెలంగాణలో పవన్ కల్యాణ్ తోడును తెలంగాణ కమలనాథులు కోరుకోవటం లేదు. తమ మీద ఏ ఆంధ్రా పార్టీ నీడ పడకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ఇలా చూసినప్పుడు పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఒంటరి పోరు తప్ప మరో మార్గం లేదు.
మిగిలిన పార్టీలతో పోలిస్తే.. షర్మిల పార్టీ మాదిరి పవన్ పార్టీకి ఎలాంటి నేతల అండా లేదు. కనీస గుర్తింపు ఉన్న నాయకుడు ఎవరూ ఆ పార్టీలో లేరు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ తమ వ్యక్తిగత ఛరిష్మాతో ఫలితాన్ని ప్రభావితం చేసే నేత జనసేనలో లేరు. అలాంటివేళ.. తెలంగాణలో పోటీ చేసి పవన్ సాధించేదేమిటి? అన్నది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఫోకస్ మొత్తం ఏపీ మీద పెట్టి.. అక్కడ అధికారంలోకి రావటానికి కీలక భూమిక పోషించిన తర్వాత.. తెలంగాణ మీద పట్టు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే అంతో ఇంతో బాగుంటుందని కానీ.. అందుకు భిన్నంగా బలం లేని వేళ.. బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే.. అడ్డంగా దొరికిపోవటమే కాదు.. ఓటమి నష్టం ఏపీ మీద పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే తెలంగాణలో వచ్చే ఏడాది (2023 చివర్లో).. ఏపీలో 2024 ఏప్రిల్.. మేలలో జరిగే వీలుంది. ఒకవేళ తెలంగాణలో పార్టీ పోటీ చేసి.. ఎలాంటి ప్రభావం చూపించలేకపోతే.. ఆ ఓటమి తాలుకూ షాక్.. ఏపీలో జరిగే ఎన్నికల మీద కచ్ఛితంగా ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఎన్నికల్లో సత్తా చూపలేని వేళ.. మౌనంగా ఉంటే మర్యాద ఉంటుందే తప్పించి.. బరిలోకి దిగి అభాసుపాలు కాకూడదన్నది మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతో ఇంతో బలం ఉన్న కేసీఆర్ సైతం.. గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రశ్నిస్తే.. తమ లక్ష్యం తెలంగాణ సాధన అంటూ మాట చెప్పి తప్పుకున్నారే తప్పించి.. బరిలోకి దిగి అభాసు కాలేదు. తాజాగా ఈ తరహా చర్చ జనసేనలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.మరి.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.